సూర్యాపేటటౌన్ : మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)ను నియంత్రించేందుకు 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు టీకాలు వేసే కార్యాక్రమాన్ని జిల్లాలో ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నారు.
ఇప్పటికే సిబ్బందికి శిక్షణ
హెచ్‌పీవీ టీకాను వేసేందుకు ఇప్పటికే ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్‌వైజర్లతో పాటు వైద్యులకు శిక్షణ ఇచ్చారు. టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదట సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి ఏరియా ఆసుపత్రులలో నడిగూడెంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచి అన్ని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కూడా వ్యాక్సిన్‌ను అందిస్తారు. ఈ వ్యాక్సిన్‌పై ఏమైనా అపోహలు, సందేహాలు ఉంటే వాటిని సంబంధిత పీహెచ్‌సీ వైద్యధికారులు నివృత్తి చేయనున్నారు.
బాలికల గుర్తింపు..
జిల్లాలో 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు 11,964 మంది ఉంటారని అధికారులు గుర్తించారు. వీరికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 01, 2011 నుంచి మార్చి 31, 2012 మధ్య పుట్టిన ఆడపిల్లలకు తలిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యాక్సిన్ వేయించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. వారు తమ పరిధిలోని పీహెచ్‌సీకి ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని తల్లి లేదా తండ్రిని వెంట తీసుకొని రావాలని సూచిస్తున్నారు.
100 శాతం పూర్తి చేస్తాం
ఈ నెల 8వ తేదీ నుంచి బాలికలకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే నెల నుంచి అన్ని పీహెచ్‌సీల్లో టీకాలు వేస్తాం. అందరూ సహకరించి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా చూడాలి. 14 నుంచి 15ఏళ్ల లోపు బాలికలు టీకా వేయించుకొని క్యాన్సర్‌ను పారదోలాలి.
–డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా
జిల్లాలో 11964 మంది గుర్తింపు


