రోడ్ల విస్తరణకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

రోడ్ల విస్తరణకు మోక్షం

Mar 7 2026 9:31 AM | Updated on Mar 7 2026 9:31 AM

హుజూర్‌నగర్‌కు రూ.62 కోట్లు

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు

కోదాడ : కోదాడ నియోజకవర్గంలోని పలు రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం మూడు ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణకు మేజర్‌ డిస్ట్రిక్‌ రోడ్‌ ప్లాన్‌ (ఎండీఆర్‌) కింద రూ.68 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్‌ గురువారం పాలనాపరమైన జీఓ జారీ చేశారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తం 22.60 కిలోమీటర్ల రహదారులను విస్తరించనున్నారు. కోదాడ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి అనంతగిరి వరకు 6.60 కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉండగా 10 మీటర్లకు విస్తరించనున్నారు. మునగాల మండలంలోని జాతీయ రహదారి నుంచి నేలమర్రి వరకు పది కిలోమీటర్ల సింగిల్‌ రోడ్డును రూ.24 కోట్లతో డబుల్‌ రోడ్డుగా మార్చనున్నారు. కోదాడ మండలం దోరకుంట నుంచి కాపుగల్లు వరకు 6 కిలోమీటర్ల సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించనున్నారు.

అనంతగిరి రోడ్డుకు మోక్షం

కోదాడ నుంచి అనంతగిరి వెళ్లే రోడ్డు పట్టణ పరిధిలో అర కిలోమీటర్‌ మేర ఇరుకుగా ఉంది. దాంతో నిత్యం ట్రాఫిక్‌ జాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలతో ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న నాగార్జున లాడ్జి నుంచి పెద్దచెరువు అలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా భవనాలు ఉన్నాయి. రోడ్డు విస్తరించాలంటే వీటిని పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6 మీటర్లు ఉన్న రోడ్డును 10 మీటర్ల మేర విస్తరించాలంటే రోడ్డుకు ఇరు వైపులా ఐదు అడుగుల మేర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హుజూర్‌నగర్‌ : నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన కృషి ఫలితంగా నియోజకవర్గంలో 26.5 కిలో మీటర్ల సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులతో పాటు మేజర్‌ డిస్ట్రిక్‌ రోడ్‌ ప్లాన్‌ కింద రూ. 62 కోట్లు మంజూరు చేసింది. తక్షణమే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement