హుజూర్‌నగర్ : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్‌నగర్‌కు చేరుకొని స్థానిక రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షిస్తారు. అనంతరం సాయంత్ర 5 గంటలకు చింతలపాలెం మండలంలోని దొండపాడులో జరుగుతున్న తిరుపతమ్మ జాతరలో మంత్రి పాల్గొంటారు. అనంతరం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జరిగే వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌కు వెళతారు.
నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని శుక్రవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తలు పాల్గొన్నారు.
రివర్షన్‌తో ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం
మద్దిరాల : రివర్షన్ పొందిన, క్రమశిక్షణ చర్యలకు గురైన ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఏ స్థానాలు కేటాయించకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందిన వారిలో కొందరు అనివార్య కారణాలతో రివర్షన్ తీసుకున్నారన్నారు. ప్రమోషన్ ఇష్టం లేకపోతే ముందే నాట్ విల్లింగా అని ఇస్తే మరో 30 మంది ఎస్జీటీలకు ప్రమోషన్ అవకాశం వచ్చేదన్నారు. అధికారులు ఈ విషయమై సమీక్ష జరిపి ఎస్జీటీలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షులు జి.రాములు, కె.ఉమేష్‌రెడ్డి, సభ్యులు జి.శివప్రసాద్, పి.సురేష్, ఎండీ.అలీమొద్దీన్, షరీఫ్ పాల్గొన్నారు.
ఇరాన్‌పై దాడులను నిలిపివేయాలి
సూర్యాపేట అర్బన్ : ఇరాన్‌పై అమెరికా –ఇజ్రాయిల్ దేశాల దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అరబ్ దేశాలలో ఉన్న ఆయిల్, సహజ వాయువులను దోచుకోవడం ట్రంప్‌కు అలవాటై పోయిందన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను మరచి, కనీసం పాఠశాలలను కూడా వదిలిపెట్టకుండా మిస్సైల్స్‌తో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య, నాయకులు పాల్గొన్నారు.
నకిలీ మందులు
విక్రయిస్తే కఠిన చర్యలు
గరిడేపల్లి : నకిలీ మందులు విక్రయించే మెడికల్ షాపు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు గ్రామంలోని మెడికల్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. షాపులో నిల్వ ఉంచిన ఔషధాలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు చెప్పారు. మెడికల్ షాపులో నకిలీ మందులు, ప్రభుత్వం నిషేధించిన చిన్నపిల్లల దగ్గు టానిక్స్ విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో షాపును తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.


