సైనస్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి
ప్రశ్న: బీపీ, షుగర్, గుండె జబ్బుల రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి
– అంజయ్య, సూర్యాపేట
సమాధానం : బీపీ, షుగర్, గుండె జబ్బు ఉన్న వారు చలిలో తిరగొద్దు. చలి ప్రభావంతో రక్తనాళాలు మూసుకపోయి రక్తప్రసారంలో ఇబ్బందులు ఏర్పడటం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు, వృద్ధులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. చలిలో బయటకు వెళ్లకపోవడం మంచిది.
సూర్యాపేటటౌన్ : ‘కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. చల్లని గాలులు, కాలుష్యం ప్రభావంతో చిన్నారులు, వృద్దులు, గర్భిణులు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమయంలో జనం అప్రమత్తంగా ఉండాలి. స్వీయరక్షణతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు’ అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. చలికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించింది. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానాలు ఇచ్చారు. తగిన సలహాలు, సూచనలు చేశారు.
ప్రశ్న: చలి తీవ్రత ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి –పిచ్చయ్య, మేళ్లచెరువు
సమాధానం : నవంబర్ నెల నుంచి చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లకూడదు. శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. లో దుస్తులు ధరించి వెచ్చదనానికి ఉన్ని దుస్తులు ధరించాలి. అనారోగ్య సమస్య వస్తే మెడికల్ షాపుల్లో ఇష్టమొచ్చిన యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు.
ప్రశ్న: వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేయాలి
– మోత్కూరి వీరభద్రాచారి,
గణపవరం, మునగాల మండలం
సమాధానం : మునగాల మండల కేంద్రంలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేయాలంటే మా పరిధిలో ఉండదు. కలెక్టర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేందుకు నావంతు కృషి చేస్తా.
ప్రశ్న: సైనస్ సమస్య వల్ల విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
– మల్లెపాక యాకయ్య, లక్ష్మాపురం, నాగారం
మండలం
సమాధానం : ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి సైనస్ సమస్య ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మెదడు చురుకుదనం తగ్గి కళ్లు తిరుగుతాయి. ఉదయం, రాత్రి వేళల్లో నిండు దుస్తులు వేసుకొని గాలి తలగకుండా ఉన్ని దుస్తులు ధరించాలి. సమస్య తీవ్రంగా ఉంటే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చెవి, ముక్కు వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్యులను సంప్రదించడం మంచిది.
ప్రశ్న: సూర్యాపేటలో కేన్సర్ ఆసుపత్రి ఉందా?
– వెంకటేశ్వర్లు, సూర్యాపేట
సమాధానం : సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేన్సర్ సెంటర్‌ను ప్రారంభించాం. మొదట హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో టెస్టులు చేయించుకొని నిర్ధారణ అయితే ఇక్కడ చికిత్స అందిస్తారు.
ప్రశ్న: గొంతు నొప్పి వస్తోంది.. ఏం చేయాలి
– ప్రమీల, సూర్యాపేట
సమాధానం : ప్రతి రోజు ఉదయం గోరు వెచ్చని నీరు తాగాలి. అలాగే వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. ఇవి చేయడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ ఉదయం బాగా ఆవిరి పట్టినా ఉపశమనం ఉంటుంది.
ఫ చలిలో పిల్లలు, వృద్ధులు,
గర్భిణులు బయటికి వెళ్లొద్దు
ఫ అస్వస్థతకు గురైతే డాక్టర్‌ను సంప్రదించాలి
ఫ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అన్ని
పీహెచ్‌సీల్లో అందుబాటులో మందులు
ఫ ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో డీఎంహెచ్‌ఓ
డాక్టర్ పెండెం వెంకటరమణ
ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి
– శ్రవణ్, కోమటిపల్లి, అర్వపల్లి మండలం
సమాధానం : వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్నవి, ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినవి, బయట దొరికే చిరుతిండి , కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీంల జోలికి వెళ్లొద్దు. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. అలా చేయకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్థాలు తీసుకోవాలి.
ప్రశ్న: మా పిల్లలకు జ్వరం, దగ్గు విపరీతంగా వస్తోంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
– పిట్టల జానయ్య, అడివెంల, అర్వపల్లి మండలం
డీఎంహెచ్‌ఓ : చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లల పట్ల అశ్రద్ధ చేయొద్దు. బయటకు వెళితే కాళ్లకు గాలి తగలకుండా సాక్స్‌లు, చేతులకు గ్లౌజులు వేయాలి. అలాగే ముక్కులోకి చలిగాలి వెళ్లడం ద్వారా ద్రవాలు గడ్డ కట్టి రక్తం పడే అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిని తాగించాలి. అలాగే ఆవిరి పడితే తుమ్ముల నుంచి ఉపశమనం పొందుతారు. చల్లటి పదార్థాలు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు.
సైనస్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి


