
పంట.. వంట.. మనదే
ప్రభుత్వం సరఫరా చేసిన కూరగాయల విత్తనాల ప్యాకెట్లు పంపిణికి సిద్ధం ఉన్నాయి. ఈ విత్తనాలను ఎంపిక చేసిన కేంద్రాలకు సరఫరా చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయాలు, టీచర్లకు తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఉద్యానశాఖ అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం.
– దయానందరాణి,
జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి
●
నాగారం : ఖాళీ స్థలాలు కలిగిన అంగన్‌వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకు కూరలు పండించాలని ప్రభుత్వం నిర్ణయించించి. బయట కూరగాయల ధరలు పెరగడం, నాణ్యత కొరవడడం, సమయానికి సరిపడా లభించకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాల ప్యాకెట్లను పంపిణీకి సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ పోషణ్ వాటిక పథకం కింద జిల్లాలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఇందుకోసం ఎంపిక చేశారు. టమాట, వంగ, బెండ, పాలకూర, తోటకూర, మెంతి కూర విత్తనాల ప్యాకెట్‌లు ఇవ్వనున్నారు.
ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించేలా..
పోషణ్ వాటికను తొలి విడతలో జిల్లాలో 150 కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టమాట, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, మెంతికూర సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైన విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 180 కేంద్రాల్లో తోటలు పెంచుతుండగా తాజాగా మరో 150 అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయల విత్తనాలు వచ్చాయి. వీటిని ఎంపిక చేసిన కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో సాగుచేస్తారు. ఐదేళ్లపాటు పెంపకం, నిర్వహణకు ప్రభుత్వం రూ.10వేలు అందజేస్తుంది. వీటిని ఉద్యానశాఖ అధికారులు పర్యవేక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఫ పోషణ్ వాటిక పథకం కింద
కూరగాయల సాగు
ఫ నూతనంగా 150 అంగన్‌వాడీ
కేంద్రాల్లో సాగు చేసేలా ప్రణాళిక
ఫ ఒక్కో కేంద్రానికి త్వరలో
విత్తనాల ప్యాకెట్లు పంపిణీ
అద్దె భవనాల్లోనే అధికం..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 313 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 435 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 461 ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌లో కొనసాగుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 0–6 నెలల పిల్లలు 3669, 7నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 25,669 మంది, 3–6 సంవత్సరాల పిల్లలు 18,066 మంది, గర్భిణులు 5,947 మంది, బాలింతలు 3,888 మంది నమోదై ఉన్నారు. సొంత భవనాల్లోనూ స్థలాలు లేనిచోట పెరటి సాగు చేయడం లేదు. ఇక అద్దె భవనాల సంగతి చెప్పనక్కర్లేదు. మొత్తానికి స్థలాలు లేవన్న కారణంగా అత్యధిక కేంద్రాలు పెరటి సాగును పక్కన పెట్టారు. కూరగాయలను బయటే కొంటున్నారు. నాణ్యత లేకపోవడం, ధరలు విపరీతంగా ఉన్నా కొనుగోలు చేయక తప్పడం లేదు.

పంట.. వంట.. మనదే