
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి
భానుపురి (సూర్యాపేట) : గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఎస్పీ కె.నరసింహతో కలిసి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మండపాల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ శాంతిభద్రలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని తగినట్లుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, రుక్మారావు, రాజేశ్వరరావు, రమేష్, నరసింహారావు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కారింగుల ఉపేందర్, కార్యకర్తలు, షేక్ ఫారూక్ పాల్గొన్నారు.
తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు
భానుపురి (సూర్యాపేట) : విధి నిర్వహణలో తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ భూమికి సంబంధించి పహాణీలో ఇతరుల పేరు రాసి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఇదేవరకే అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఈ విషయమై తాను రెండు రోజుల క్రితమే గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్‌ను ఆదేశించామని పేర్కొన్నారు.
సూర్యాపేట : సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు పక్కన ఖాళీ ప్రదేశంలో పిచ్చిమొక్కలను తొలగించి అందమైన పూల మొక్కలు పెంచాలన్నారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం సద్దల చెరువు పరిధి ఎక్కడ వరకు ఉందో మున్సిపల్ కమిషనర్‌ను, చెరువు ఎఫ్‌టీఎల్ ఎక్కడకు ఉందో ఇరిగేషన్ అధికారులు, ఖాళీ ప్రదేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో పర్యాటక శాఖ ఏఈని నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ఇరిగేషన్ డీఈ పాండునాయక్, టూరిజం ఏఈ మణికంఠ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్