
మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణ వేడుకల్లో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగల్యధారణ నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నిక
సూర్యాపేట : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వెంకన్న, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాదెండ్ల బాలకృష్ణ, జిల్లా కార్యదర్శిగా యాదగిరి నాయుడు, జిల్లా అదనపు కార్యదర్శిగా నరసింహారెడ్డి ఎన్నికయ్యారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్
● సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన పంచాయతీ కార్యదర్శి ఆడియో
పాలకవీడు: మండలంలోని జాన్‌పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శి బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు మంజూరు కావాలంటే తనకు కొంత డబ్బు ముట్టజెప్పాలని, లేదంటే వాటిని నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తూ స్వయంగా లబ్ధిదారులతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకట్ స్పందిస్తూ గ్రామంలో తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, లబ్ధిదారులే త్వరగా బిల్లు మంజూరయ్యేలా చూడాలని, అందుకు కొంత డబ్బు ఇస్తామని తనను ట్రాప్ చేశారని పేర్కొన్నారు. ఎంపీడీఓ లక్ష్మిని సంప్రదించగా.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో బిల్లు మంజూరుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డీటీఎఫ్ రాష్ట్ర
కార్యదర్శిగా లింగయ్య
సూర్యాపేటటౌన్ : డీటీఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని హైదరాబాద్‌లో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా సూర్యాపేటకు చెందిన రేపాక లింగయ్య, ఆడిట్ కమిటీ సభ్యుడిగా సీహెచ్ వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కౌన్సిల్‌కు, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం

మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం