
యూరియాకు ఎలాంటి కొరత లేదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఇప్పటివరకు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని, ఈ నెలలో 3800 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 6, 7 రోజుల్లో స్టాక్ రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ప్రతిరోజు 600 నుంచి 700 మెట్రిక్ టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నిరంతరం తనిఖీలు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రతిరోజు మండలాల వారీగా యూరియా, ఇతర ఎరువులకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని, అలాగే టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతులు నానో యూరియా వాడే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ నరసింహ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
శిథిలావస్థలో ఉన్న ఇళ్లను
ఖాళీ చేయించాలి
భానుపురి (సూర్యాపేట) : భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్ కుమార్, డీపీఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, సీపీఓ కిషన్ పాల్గొన్నారు.