
వైద్యశాల స్థలంపై పట్టింపేది..!
వైద్యశాఖ అధికారులకు
నోటీసులు ఇచ్చినప్పటికీ..
ఫ ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న
మున్సిపల్ అధికారులు
ఫ అభ్యంతరం వ్యక్తం చేయని వైద్యశాఖ
ఫ ప్రజల పోరాటాన్ని
పట్టించుకోని పాలకులు
కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో దాత ఇచ్చిన రెండు ఎకరాలకు 15 గుంటలు తక్కువగా ఉంది. దీనిపై మేము 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అందువల్ల వైద్యశాల స్థలంలో ఇతరుల భవనాల నిర్మాణానికి వైద్యశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయాలి. రెండు ఎకరాల స్థలం ఎక్కడ ఉందో చూపిన తరువాతే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి.
–కుదరవళ్లి బసవయ్య, కోదాడ.
కోదాడ: ఏళ్లుగా కొనసాగుతున్న వైద్యశాల స్థల వివాదంపై పాలకులకు, అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వైద్యశాలకు దాత ఇచ్చిన స్థలంపై ఎన్నో సంవత్సరాలుగా వివాదం నడుస్తున్నా నేటికీ ఓ కొలిక్కి రావడం లేదు. ఆ స్థలంపై అభ్యంతరాలు ఉన్నాయిని పట్టణ ప్రజలు చెబుతున్నా దానిని పట్టించుకునే వారే కరువయ్యారు. కోదాడ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన రెండు ఎకరాలకు 15 గుంటల స్థలం తక్కువగా ఉన్నప్పటికీ పక్కన ఉన్న రోడ్లతో సహా కొలిచి దాత వారసుడికి 500 గజాల స్థలాన్ని అక్రమంగా కేటాయించారని కోదాడ పట్టణ ప్రజలు 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ తహసీల్దార్ నుంచి రాష్ట్ర అధికారుల వరకు వినతులు ఇస్తూ వస్తున్నారు. దీంతో రెండుసార్లు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసిన అధికారులు.. మూడోసారి మళ్లీ కేటాయించారు.
పరాధీనం ఇలా..
కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు నాగుబండ పద్మయ్య 1963లో రిజిస్టర్ దానపత్రం ద్వారా 2 ఎకరాల స్థలాన్ని దానం ఇచ్చారు. 1998లో దాత మనవడు తాము దానం ఇచ్చిన స్థలం కన్నా వైద్యశాలలో ఎక్కువగా ఉందని కోర్టుకు వెళ్లాడు. ఎక్కువగా ఉంటే ఇవ్వాలని కోర్టు చెప్పడంతో.. అధికారులు భూమిని సర్వే చేసి రెండు ఎకరాలకు ఎక్కువగా ఉందని తెల్చారు. 500 గజాలు దాత వారసుడికి ఇచ్చారు. ఈ సమయంలో వైద్యశాల తూర్పువైపు ఉన్న రోడ్డును కూడా కలిపి కొలవడంతో ఎక్కువ స్థలం వచ్చిందని, వైద్యశాల కాంపౌండ్ లోపల 2 ఎకరాలకు తక్కువగా ఉందని పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి కొలిచి వైద్యశాల లోపల 15 కుంటలు తక్కువగా ఉందని తేల్చి మొదటి కేటాయింపును రద్దు చేశారు. మరోసారి దాత వారసుడు కోర్టుకు వెళ్లడంతో సర్వే అధికారులు అతడితో కుమ్మకై ్క రోడ్డును కలిపి మరోసారి కొలిచి ఎక్కువగా ఉందని తెల్చి మరోసారి స్థలాన్ని కేటాయించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వైద్యశాల తూర్పువైపు ఉన్న రోడ్డు తనదేనని దాత వారసుడు అంతకు ముందు సూర్యాపేట సబ్‌కోర్టుకు వెళ్లాడు. అది పంచాయితీకి చెందిన రోడ్డు అని కోర్టు తీర్పు చెప్పడంతోపాటు దాత వారసుడికి కోర్టు ఫైన్ కూడా వేసింది.
100 పడకల వైద్యశాల నిర్మాణం..
ప్రస్తుతం 30 పడకల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 100 పడకల వైద్యశాల నిర్మిస్తున్నారు. కాగా దాత ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో వైద్యశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి రాబట్టుకోవాలని పట్టణవాసులు అధికారులకు చేస్తున్న విజ్ఞప్తులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్రమణ విషయం పట్టించుకోకుండా ఎకరం 25 కుంటల స్థలంలో 100 పడకల వైద్యశాల నిర్మాణం సరిపోతుందని నివేదికలు ఇవ్వడం గమనార్హం.
దాత వారసుడికి కేటాయించిన స్థలాన్ని అతడు వెంటనే ఇతరులకు అమ్ముకున్నాడు. కొన్నవారు ఈ స్థలంలో భవన నిర్మాణాలకు వారు దరఖాస్తు చేయగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడిచిన పది సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా ఆపుతున్నారు. తాజాగా వారు కోర్టుకు వెళ్లడంతో మున్సిపల్ అధికారులు 23 జూన్ 2025న వైద్యశాల అధికారులకు నోటీసు ఇచ్చారు. ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆరు వారాల్లోగా చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సమయం మించి పోతున్నా నేటి వరకు వైద్యశాఖ అధికారులు స్పందించిన దాఖాలాలు లేవు. దీంతో మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే వైద్యశాల స్ధలం శాశ్వతంగా పరాధీనమై 20 సంవత్సరాల పట్టణ ప్రజల పోరాటం బూడిదలో పోసిన పన్నీరవుతుందని పలువురు పేర్కొంటున్నారు.