
సిబ్బందిపై ఓవర్ లోడ్
ఇబ్బందులు ఉంటే సమాచారం ఇవ్వాలి
పోస్టులు, ఖాళీల వివరాలు
నాగారం : విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడక్కడా సిబ్బంది సర్దుబాటు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయాల్సి రావడంతో వినియోగదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఏటా కనెక్షన్లు పెరుగుతున్నా..
జిల్లాలో ఏటా గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా దానికి తగ్గట్టు సిబ్బందిని నియమించడం లేదు. జిల్లాలో సూర్యాపేట, హుజూర్‌నగర్ రెండు విద్యుత్ డివిజన్‌లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలో ప్రతి 1,500 సర్వీసులకు ఒక జూనియర్ లైన్‌మెన్ పోస్టు ఉండాలి. ప్రతి 3వేల కనెక్షన్లకు అసిస్టెంట్ లైన్‌మెన్, ప్రతి 4,500 కనెక్షన్లకు లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్ ఉండాలి. రెండు డివిజన్ల పరిధిలో క్షేత్రస్థాయిలో సిబ్బంది 534 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 405 మంది పనిచేస్తున్నారు. 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వ్యవసాయ బావుల వద్ద ఫ్యూజులు పోతే విద్యుత్ సిబ్బంది రావడం ఆలస్యం అవుతోంది. గ్రామాల్లోనూ రాత్రిపూట ఫ్యూజులు పోతే పెట్టడానికి ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. వారు వచ్చేలోపు రైతులు, గ్రామస్తులే సరిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యుత్ ప్రమాదాల బారిన పడుతున్నారు.
జేఎల్‌ఎం, ఏఎల్‌ఎంల ఖాళీలే అధికం..
జిల్లాలో జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 2019లో జేఎల్‌ఎం పోస్టులు భర్తీ కాగా, ఏడాది విధులు పూర్తిచేసుకున్న వారంతా ఏఎల్‌ఎంలుగా పదోన్నతులు పొందారు. దీంతో జేఎల్‌ఎం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిపై పనిభారం పడడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఏ రాత్రయినా విద్యుత్ పునరుద్ధరణకు క్షేత్రస్థాయి సిబ్బందే పనులు చేయాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో వెళ్లాలంటే మరో సిబ్బందికి అదనంగా పని కల్పించాల్సి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యుత్ శాఖలో పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయి సిబ్బంది ఖాళీల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
– శ్రీనివాస్, ట్రాన్స్‌కో డీఈఈ సూర్యాపేట
విద్యుత్ శాఖలో భర్తీకాని ఖాళీ పోస్టులు
ఫ నాలుగేళ్లుగా నియామకాల్లేవు
ఫ ఉన్నవారిపై అదనపు పనిభారం
ఫ జిల్లా వ్యాప్తంగా 129 పోస్టులు ఖాళీ
గృహ విద్యుత్ కనెక్షన్లు 4,51,501
వ్యవసాయ కనెక్షన్లు 1,54,270
ఉండాల్సిన సిబ్బంది 534
ప్రస్తుతం ఉన్నవారు 405
పోస్టు మొత్తం పనిచేస్తున్నవారు ఖాళీలు
జూనియర్ లైన్‌మెన్ 172 110 62
అసిస్టెంట్ లైన్‌మెన్ 130 80 50
లైన్‌మెన్ 170 159 11
లైన్ ఇన్‌స్పెక్టర్ 50 48 02
ఫోర్‌మెన్ 12 08 04

సిబ్బందిపై ఓవర్ లోడ్

సిబ్బందిపై ఓవర్ లోడ్