మేళ్లచెరువు : చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఆదివారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1,73420 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. ఎనిమిది గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి దిగువకు 2,90,526 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
వైభవంగా నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన మధుఫర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
మట్టపల్లి క్షేత్రంలో
ఉట్ల పండుగ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రెండో రోజు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉట్ల పండుగను వైభవంగా నిర్వహించారు. పెదవీడు గ్రామానికి చెందిన యాదవులు ఆలయ కల్యాణ మండపం వద్ద ఉట్లు గొట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో నవీన్‌కుమార్, అర్చకులు, యాదవులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ
క్రీడా పోటీలకు ఎంపిక
మేళ్లచెరువు: మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన దివ్యాంగ క్రీడాకారుడు రాగుల నరేష్‌యాదవ్ మరోసారి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అక్టోబర్ 8 నుంచి అమెరికాలో జరగనున్న పారా ఒలింపిక్ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తాను ఎంపికై నట్లు నరేష్‌యాదవ్ ఆదివారం తెలిపారు. గతంలో వివిధ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపిన నరేష్,.. 2014లో చైనాలో జరిగిన ప్రపంచ పారా బీచ్ వాలీబాల్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. తన ప్రతిభను గుర్తించి అమెరికాలో జరగనున్న పోటీలకు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా తనను ఎంపిక చేసినట్లు నరేష్ వెల్లడించారు. చిన్నతనంలో కాలుకు పోలియో సోకడంతో నరేష్ దివ్యాంగుడయ్యారు. నరేష్ చిన్నతనం నుంచి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో వివిధ విభాగాల్లో ఎన్నో పతకాలు సాధించారు.
పులిచింతల ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
పులిచింతల ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల