
కోదాడలో మళ్లీ వరద
కోదాడ: కోదాడ పట్టణంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. కోదాడ పెద్దచెరువుకు భారీగా వరద రావడంతో అలుగు పోస్తోంది. దీంతో కోదాడ –అనంతగిరి రోడ్డుపై వరద పారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి కోదాడ పెద్ద చెరువు అలుగునీటితో పూర్తిగా మునిగిపోయిన కోదాడ –ఖమ్మం రోడ్డులోని షిర్డీసాయినగర్ కాలనీ గురువారం రాత్రి కురిసిన వర్షానికి మరోసారి ముంపునకు గురైంది. ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో కాలనీ వాసులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. పెద్దచెరువు అలుగు వాగులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వారం రోజుల క్రితం కాలనీ వాసులు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దచెరువు అలుగుపోసి వరద కాలనీ మీదకు మళ్లిందని, దీంతో మళ్లీ ముంపుబారిన పడ్డామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే భవానీనగర్ కూడా గతేడాది మాదిరిగానే గురువారం రాత్రి కురిసిన వర్షానికి ముంపునకు గురైంది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సాయంతో కాలనీ మధ్యలో ఉన్న నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న డివైడర్లను పగులగొట్టి వరదనీటిని కిందివైపు మళ్లించారు. అయితే గతేడాది ఈ రెండు కాలనీలను పరిశీలించిన కలెక్టర్ ఆక్రమణలు తొలగించి నాలా వంతెనను వెడల్పు చేయాలని ఆదేశించినా సమస్య పరిష్కారం కాలేదు. అలాగే కోదాడ–అనంతగిరి రోడ్డులో పెట్రోల్‌బంక్ వద్ద ఉన్న ఎర్రకుంట అలుగు కాలువపై మజీద్ వద్ద పెద్ద గూనలతో కల్వర్టు నిర్మించి, కాల్వను వెడల్పు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.
ఫ నీట మునిగిన షిర్డీసాయినగర్, భవానినగర్ కాలనీలు
ఫ గతేడాది వరద ముంచెత్తినా
ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు
ఫ పెద్ద చెరువు అలుగు పోస్తుండడంతో రాకపోకలకు ఆటంకం

కోదాడలో మళ్లీ వరద