
ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, వంతెనల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండల పరిధిలోని మూసీనది ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే భీమారం గ్రామం వద్ద వంతెనను పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టులు, వంతెల వద్ద పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు మూసీనదిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు. యువత సెల్ఫీలు అంటూ విషాదం కొనితెచ్చుకోవద్దని సూచించారు. సూర్యాపేట, పెనపహాడ్, నేరేడుచర్ల, పాలకవీడు పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం వల్ల కృష్ణానదిలో నీటి ఉధృతి అధికంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, డయల్ 100, జిల్లా స్పెషల్ బ్రాంచ్ 87126 86026 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఎస్పీ వెంట సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త
సూర్యాపేటటౌన్ : బ్యాంకులకు వరుసగా పండగ సెలవులు ఉన్నందున సైబర్ మోసగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండగ బహుమతులు అంటూ, స్పెషల్ ఆఫర్స్ అంటూ ఏమైనా బ్లూ లింక్స్, మెసేజ్‌లు వచ్చినా వాటిని అనుసరించవద్దని, అపరిచితులు డబ్బులు అడిగితే స్పందించవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్ మోసగాళ్ల వల్ల ఆర్థిక నష్టానికి గురైతే వెంటనే 1,930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
ఫ ఎస్పీ నరసింహ