
ప్రయోగ ఫలం రైతు దరిచేరేలా..
భానుపురి (సూర్యాపేట) : రైతులకు ఆధునిక సాగుపై మరింత అవగాహన కల్పించేలా రైతు విజ్ఞాన కేంద్రం రానుంది. జిల్లాకో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో రోజురోజుకూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు రైతులకు మరింత చేరువ కానున్నాయి. ఇప్పటికే జిల్లాలో గడ్డిపల్లిలోని కేవీకే ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందుతుండగా.. రైతు విజ్ఞాన కేంద్రంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,70,853 మంది ప్రయోజనం కలగనుంది.
రైతన్నలకు మేలు
కొత్తగా ఏర్పాటు కానున్న రైతు విజ్ఞాన కేంద్రంతో రైతులకు ఎంతో మేలు కలగనుంది. ప్రధానంగా ఈ కేంద్రం ఏర్పాటుతో ఐదారుగురు శాస్త్రవేత్తలు, వారి సహాయక సిబ్బంది రైతులకు అందుబాటులోకి రానున్నారు. ప్రయోగశాల ఏర్పాటు చేయడమే కాకుండా విత్తనాభివృద్ధి, సాగు క్షేత్రాలు ఉంటాయి. ఈ క్షేత్రాల్లో రైతులకు డ్రోన్లు, ఇతర యంత్రాలపై శిక్షణ ఇవ్వనున్నారు. నిత్యం ఏదో ఒక పంటపై పరిశోధనలు, ప్రయోగాలు, రైతు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రైతులకు శాస్త్రవేత్తలు, ఇతర వ్యవసాయ అధికారులు సైతం అందుబాటులోకి ఉండి సాగులో సమస్యలు తొలగనున్నాయి. అలాగే ఈ రైతు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ప్రయోగాలు సైతం పొలాల వరకు చేరుతాయి.
సాగులో కొత్త పుంతలు..
జిల్లాలో వ్యవసాయం కొంత మూసపద్దతిలోనే సాగుతోంది. ప్రధానంగా జిల్లాలో వరిని అత్యధికంగా పండిస్తారు. తదనంతరం పత్తి సాగు చేపడుతారు. ఏ నేలల్లో ఏ పంట వేస్తే మేలు జరుగుతుందన్న ఆలోచన లేకుండా మూస పద్ధతిలో వెళుతుండగా.. ఇందులోనూ ఇప్పుడిప్పుడే రైతులు యాంత్రీకరణ వైపు మళ్లుతున్నారు. అన్నదాతలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి పద్ధతిని అవలంబించడంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా విత్తనాల సాగు నుంచి అన్నింట్లోనూ డ్రోన్ల వాడకం పెంచనున్నారు. యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా అందించనున్నారు.
ప్రధాన పంటలు :
వరి, పత్తి
నేలలు : ఎర్రనేలలు,
నల్లరేగడి,
ఎర్ర చెల్క,
ఇసుక
నేలలు
వ్యవసాయ భూమి :
8,95,680 ఎకరాలు
మండలాలు 23
రైతులు :
2,70,853 మంది
గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది
జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆదేశాలు, గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది. అయితే రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుతో జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రం మొత్తం మారిపోతుంది. – శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

ప్రయోగ ఫలం రైతు దరిచేరేలా..