
క్రీడలతో స్నేహభావం
చివ్వెంల(సూర్యాపేట) : క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని, ప్రశాంత వాతావరణంలో క్రీడలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, జూనియర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమికి అదనపు బస్సులు
రామగిరి(నల్లగొండ): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆ సంస్థ రీజనల్ మేనేజర్ (ఆర్‌ఎం) కె.జానిరెడ్డి తెలిపారు. పండుగ రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి సుమారు 150 నుంచి 170 వరకు అదనంగా బస్సులను నడపనున్నట్టు పేర్కొన్నారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ స్పెషల్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోలర్స్, సూపర్‌వైజర్లను నియమించామని పేర్కొన్నారు. ప్రయాణికులు అదనపు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భూ చట్టాలపై అవగాహన అవసరం
కోదాడ రూరల్: భూ చట్టాలపై రైతులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికతో పాటు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో గురువారం సాగు న్యాయ యాత్ర సమావేశాన్ని రైతులతో కలిసి ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించినప్పుడే సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్‌లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయని, వీటిపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, హరి వెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ఏఓ రజిని, పీఏసీస్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
15న హర్ ఘర్ తిరంగా
సూర్యాపేట అర్బన్ : ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 15న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతా రెడ్డి కోరారు. విభజన గాయాల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలపై గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యశాలకు పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డితో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నారు. తిరంగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొని దేశభక్తిని ప్రదర్శించాలన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలో పేరు గాంచిన చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మాల్సూర్ గౌడ్, కో కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ మన్మథరెడ్డి, సీనియర్ నాయకులు కర్నాటి కిషన్, చలమల నరసింహ, కృష్ణయ్య, సులోచన, అనూష, శకుంతల, శోభా, సీత పాల్గొన్నారు.

క్రీడలతో స్నేహభావం