
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
తుంగతుర్తి : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, ఎక్స్‌రే మిషన్, ల్యాబ్ ను పరిశీలించారు. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంటగది, వాటర్ ప్లాంట్, సరుకుల గదిని అధికారులతో కలియ తిరుగుతూ పరిశీలించారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్లి విద్యార్థులు ఏవిధంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమార్, మండల విద్యాధికారి బోయిని లింగయ్య, డీసీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ రమేష్ బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, డాక్టర్లు వీణ, రాజు, ఆరోగ్య సిబ్బంది, ఎస్‌ఓ కల్పన, అధ్యాపకులు పాల్గొన్నారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిక్షరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు.
కేజీబీవీ ఎస్‌ఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి
తుంగతుర్తి కేజీబీవీ ఎస్‌ఓ కల్పనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో రికార్డులను చూపాలని కోరగా నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్