
ఆర్‌ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయవద్దు
మునగాల: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయవద్దని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయమనోహరి సూచించారు. మునగాల మండల కేంద్రంలో ఇటీవల వైద్యం వికటించి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నేపథ్యంలో చికిత్స చేసిన చంద్రమౌళి క్లినిక్‌ను ఆమె తనిఖీ చేశారు. క్లినిక్‌తో పాటు ల్యాబ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో చంద్రమౌళి అందుబాటులో లేకపోవడంతో ల్యాబ్ నిర్వాహకుడు గోపగాని రమేష్‌ను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం వికటించి మృత్యువాత పడిన యువకుడు వెంకటేశ్వర్లుకు ఏ విధమైన వైద్యం అందించారని అడిగారు. దీంతో రమేష్ సమాధానం ఇస్తూ .. జ్వరంతో బాధపడుతూ నీరసంగా క్లినిక్‌కు వచ్చిన వెంకటేశ్వర్లుకు రక్త పరీక్షలు నిర్వహించామన్నారు. రక్త కణాలు తక్కువగా ఉండడంతో సైలెన్ పెట్టి యాంటీబయోటిక్ ఇంజక్షన్ ఇచ్చామన్నారు. అయితే వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కోదాడకు తీసుకెళ్లాలని తాము అతని కుటుంబ సభ్యులకు సూచించామని తెలిపారు. ల్యాబ్‌కు పరిమితి ఉందా ? అని ల్యాబ్ నిర్వాహకుడిని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయమనోహరి అడిగారు. దీంతో అనుమతి పత్రం తీసుకురాగా గడువు నెల రోజుల క్రితమే ముగిసినట్లు గుర్తించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు . మూడు నెలలకు ముందే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తాను విచారణ చేపట్టానని ఇందుకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా అధికారికి అందచేజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాఽధికారి డాక్టర్ పి.రవీందర్, సూపర్‌వైజర్ శ్రీను, హెల్త్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు.