
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఆహార భద్రత చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో గురువారం ఫుడ్ కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఫుడ్‌కమిషన్ చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యం, స్కూల్స్, హాస్టల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఇక్కడ ఆహార భద్రత చట్టాన్ని బాగా అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో అమలు చేస్తే తెలంగాణ ఆహార భద్రత చట్టం పూర్తిగా అమలు చేసిన వారమవుతామన్నారు. రేషన్ షాపుల్లో వేయింగ్ విషయంలో ఇబ్బందులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్స్, పాలు, బాలామృతం, ఆట వస్తువులు సక్రమంగా సరఫరా చేయాలని తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామన్నారు. అనంతరం ఫుడ్ కమిషన్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, శారద, భారతి, జ్యోతి, డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, సంక్షేమ శాఖల అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, హాస్టల్ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి