
పొగ కష్టాలకు చెక్..!
గ్యాస్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తాం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. జిల్లాలో 871 ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ కనెక్షన్‌లు అవసరం ఉన్నట్లు గుర్తించాం. అన్ని పాఠశాలలకు త్వరలోనే గ్యాస్ సిలిండర్లు సమకూర్చుతాం.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి
నాగారం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఇక నుంచి కట్టెల పొయ్యి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌పీజీ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. కట్టెల పొయ్యితో వంట చేస్తున్న పాఠశాలలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సిలిండర్ల వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వర్షాకాలంలో కట్టెలు తడిసి పొయ్యి మండక ఉడికీ ఉడకని భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు తరగతి గదుల్లోకి పొగ చూరుతోంది. పాఠశాలలకు వంట గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుతో వంట చేయడంలో ఆలస్యం, పొగ సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.
871 కనెక్షన్‌లు..
జిల్లాలోని 23 మండలాలు ఉండగా వీటి పరిఽధిలో మొత్తం 871 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా 42,634 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఈ పాఠశాలల్లో 1,435 మంది వంట ఏజెన్సీలున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలో కూడా ఎల్‌పీజీ కనెక్షన్ లేకపోవడంతో వంట కార్మికులు అన్ని బడుల్లో ఆరుబయట వంట చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని పాఠశాలల్లో వంట పాత్రలు కూడా సరిగా లేకపోవంతో కొన్ని నెలల క్రితం అందజేశారు.
తప్పనున్న ఇబ్బందులు..
ఇటీవల ప్రభుత్వం అన్ని పాఠశాలలకు నాణ్యమైన వంటపాత్రలు అందించింది. అలాగే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనుంది. తద్వారా విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని మండలాల పరిధిలో స్థానిక ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మధ్యాహ్న భోజన వండే కార్మికులకు గ్యాస్ సిలిండర్, స్టౌ ఉచితంగా అందిస్తుండగా గ్యాస్ మాత్రం కార్మికులే నింపుకోవాలి. జిల్లాలో 871 పాఠశాలల్లో కట్టెల పొయ్యి మీద వండుతున్నట్లుగా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేసింది.
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సిలిండర్లు
అందించేలా ప్రణాళిక
ఫ ఇప్పటికే 871 స్కూళ్లకు అవసరమని గుర్తించిన అధికారులు
ప్రభుత్వ పాఠశాలలు 871
విద్యార్థులు 42,634
వంట కార్మికులు 1435

పొగ కష్టాలకు చెక్..!