
మున్సిపల్ పోరుకు సన్నద్ధం !
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతోపాటు దానికి అనుగుణంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సమాయత్తం అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉండగా వీటిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
జనవరిలో ముగిసిన గడువు
ఈ సంవత్సరం జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. ఏడు నెలలుగా మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్డుల్లోని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. పాలకవర్గం ఉన్నంత కాలం పట్టణవాసులు తమ సమస్యలను వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. దీంతో పట్టణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలియగానే రాజకీయ పార్టీల నాయకులు క్రియాశీలకం అయ్యారు. మున్సిపాలిటీలో పట్టు సాధించాలని ప్రధాన పార్టీల నాయకులు ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమయింది.
రిజర్వేషన్లపైనే చర్చ..
మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏమేమి వస్తాయోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. చైర్మన్‌తోపాటు వార్డులకు రిజర్వేషన్లు గతంలో మాదిరిగా ఉంటాయా ? లేక కొత్తగా రిజర్వేషన్లు మారుతాయా అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండడంతో ఈసారి రిజర్వేషన్లు మారుతాయని భావిస్తున్నారు. గతంలోనే ఆయా మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజన జరగగా నివాస గృహాలు, జనాభా, కుటుంబాలను గుర్తించాల్సి ఉంది.
ఫ ఏడు నెలలుగా
ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు
ఫ ఎన్నికల కోసం ఆశావహుల ఎదురుచూపులు
ఫ కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న నాయకులు
ఫ రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ
మున్సిపాలిటీ వార్డుల నివాస జనాభా
సంఖ్య గృహాలు
సూర్యాపేట 48 39128 1,33,339
కోదాడ 35 23572 75,093
హుజూర్‌నగర్ 28 10761 35,850
తిరుమలగిరి 15 5447 18,474
నేరేడుచర్ల 15 5156 14,853