
రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం
చిలుకూరు: కుల ధ్రువీకరణ పత్రాన్ని రెండు నిమిషాల్లో పొందడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని మళ్లీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మీ సేవ కేంద్రాల్లో ఆధార్ నంబర్ ద్వారా రెండు నిమిషాల్లో తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కులం మారదు కాబట్టి అవసరం ఉన్న వారు నేరుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి రూ. 45 రుసుం చెల్లించి ఆధార్ నంబరు ద్వారా తీసుకోవచ్చు.
మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు
ప్రజల సౌకర్యార్థం మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఈ సేవలు ప్రైవేట్ సైట్‌లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వీటిని మీ సేవ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో రెవెన్యూ , అటవీ , సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు ఉన్నాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి గ్యాప్ సర్టిఫికెట్ , పౌరుని పేరు మార్పు, స్థానికత, మైనార్టీ , క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ , సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్, మానిటరింగ్, వన్య ప్రాణుల దాడిలో పరిహారం, సామిల్, టింబర్ డిపో, తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ విలువ ధ్రువపత్రం , పాన్ కార్డు సవరణ , ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాల పరిధిలో 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీలలో కలిపి 93 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి.
ఫ గతంలో తీసుకున్నవారు మళ్లీ
దరఖాస్తు చేయకుండా వెసులుబాటు
ఫ రూ.45 చెల్లించి మీసేవ
ద్వారా పొందే అవకాశం