
ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల
మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలో
కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు శనివారం ఐదు గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి 1,34,984 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 1,71,388 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాగా, ఈ ప్రాజెక్టులోని తెలంగాణ వైపు ఉన్న విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 100 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలంగాణ జెన్‌కో అధికారులు తెలిపారు.
పోర్ట్ పోలియో జడ్జిగా జస్టిస్ శ్రీదేవి
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా పోర్ట్ పోలియో జడ్జిగా జస్టిస్ జువ్వాడ శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పోర్ట్ పోలియో జడ్జిగా పనిచేసిన జస్టిస్ రాధరాణి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆమె స్థానంలో శ్రీదేవి నియమితులయ్యారు. జిల్లా కోర్టుతో పాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ కోర్టుల అడ్మినిస్ట్రేటివ్ విధులు ఆమె నిర్వహించనున్నారు.
143 మంది బాలలకు వెట్టి నుంచి విముక్తి
సూర్యాపేటటౌన్ : జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ముగిసిందని, దీని ద్వారా 143 మంది బాలలను వెట్టి నుంచి విముక్తి కల్పించినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ టీమ్స్‌తో సమావేశం నిర్వహించి ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టి నుంచి విముక్తి కల్పించినవారిలో తెలంగాణకు చెందిన వారు 76 మంది ఉండగా వీరిలో ఏడుగురు బాలికలు, 69 మంది బాలురు ఉన్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 67 మంది ఉండగా వీరిలో బాలురు 50 మంది, బాలికలు 17 మంది ఉన్నట్లు వివరించారు. బాలలతో పని చేయించుకుంటున్న 65 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వెట్టిచాకిరీకి, నిరాదరణకు గురైన బాలబాలికలు, తప్పిపోయి వచ్చిన బాలలను గుర్తించి సంరక్షించడం లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల