నేటి నుంచి రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు
గరిడేపల్లి: వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాల నుంచి భూమికి అనే నినాదంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్‌చార్జ్ డి.నరేష్ తెలిపారు. బుధవారం ఆయన కృషి విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిరోజు 3 గ్రామాల చొప్పున 23 మండలాల్లోని గ్రామాల్లో హైదరాబాద్ నుంచి ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా వానాకాలం సీజన్‌కు అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఎరువుల యాజమాన్య పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, భూసార పరీక్షలు, డ్రోన్ వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారని వివరించారు.
అదనపు ఎస్పీగా
రవీందర్‌రెడ్డి
సూర్యాపేటటౌన్ : జిల్లా పోలీస్ అడ్మిన్ అదనపు ఎస్పీగా రవీందర్‌రెడ్డి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా జిల్లా పోలీస్ అడ్మిన్ అదనపు ఎస్పీగా పనిచేసిన నాగేశ్వరరావు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రవీందర్‌రెడ్డి వచ్చారు. అనంతరం ఎస్పీ నరసింహను రవీందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అలాగే బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పీ నాగేశ్వరరావును ఎస్పీ సన్మానించారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి డి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్దులు పరిశీలించారు. సిబ్బంది వివరాలను మండల వైద్యాధికారి భవానిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల్లో ఏఎన్‌ఎంలు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాకాలం కావడంతో ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆయన వెంట వ్యాఽధి నిరోధక టీకాల ప్రోగ్రాం అధికారి డాక్టర్, కోటి రత్నం, సిబ్బంది ఉన్నారు.
దేశభక్తిని పెంపొందించడం అభినందనీయం
కోదాడ: ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించడానికి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని సినీ నటుడు సుమన్ అన్నారు. బుధవారం కోదాడలో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయజెండాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్యంలో పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఖాళీగా ఉండకుండా దేశసేవ కోసం పనిచేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన సైనికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సామినేని ప్రమీల, డాక్టర్ మధుసూదన్‌రావు, వెంకన్న, మహదేవ్, నవీన్, రహీం, నాగార్జున పాల్గొన్నారు.
నేటి నుంచి రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు
నేటి నుంచి రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు


