చిన్నారుల్లో దృష్టిలోపం నివారించేలా..
అవసరమైన వారికి కళ్లద్దాలు
నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో కంటి పరీక్షలు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న దృష్టిలోపం నివారణకు కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ప్రభుత్వం పాఠశాలల్లోని చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాల్య దశ నుంచే పిల్లల్లో వచ్చే అంధత్వ నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) సమన్వయంలో రెండు విడతలుగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొంత మందికి దృష్టి లోపం ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరికోసం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
మూడో విడతగా..
ప్రస్తుతం మూడో విడతగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మరోసారి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం జిల్లాలో నాలుగు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందం రోజుకు సుమారు 500 నుంచి 1000 మంది వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనుంది.
పరీక్షలు ఎవరికంటే..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం దృష్టి లోపుం ఉన్నట్లు గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వనున్నారు. తద్వారా ఆయా పాఠశాల్లో మొత్తం 50వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
విద్యార్థుల్లో దృష్టి లోపం గుర్తించేందుకు నేటి నుంచి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు ప్రత్యేకంగా నాలుగు వైద్య బృందాలను నియమించాం. రోజూ పాఠశాలలకు వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తాయి. అవసరమైన విద్యార్థులకు కళ్లజోళ్లు అందిస్తాం.
– డాక్టర్ వెంకటరమణ,
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
ఫ రోజూ 500 నుంచి
వెయ్యి మంది విద్యార్థులకు..
ఫ పరీక్షల నిర్వహణకు
నాలుగు వైద్యబృందాలు
ఫ 50 వేల మందికి ప్రయోజనం


