పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను సవరించాలి
సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యామ రమేశ్, జూలకంటి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పరీక్షల టైం టేబుల్ ప్రకారం ప్రతి రెండు సబ్జెక్టుల పరీక్షల మధ్య నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధి ఉందన్నారు. దాంతో పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందని, విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రెండు పరీక్షల మధ్య వ్యవధిని రెండు రోజులకు తగ్గించాలని కోరారు.


