అయోమయంలో డిగ్రీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

అయోమయంలో డిగ్రీ విద్యార్థులు

May 10 2025 2:14 PM | Updated on May 10 2025 2:14 PM

అయోమయంలో డిగ్రీ విద్యార్థులు

అయోమయంలో డిగ్రీ విద్యార్థులు

కోదాడ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన 2, 4, 6 సెమిస్టర్ల వార్షిక పరీక్షలతో పాటు 1, 3, 5 బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలను తిరిగి ఈ నెల 14నుంచి నిర్వహిస్తామని యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. దీంతో తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేసేవరకు పరీక్షల నిర్వహణకు సహకరించబోమని సహాయనిరాకరణ కొనసాగిస్తామని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు దగ్గరపడుతుండగా ఇప్పటి వరకు డిగ్రీ వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడంతో ఫైనలియర్‌ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

64 కళాశాలలు.. 20 వేల మంది విద్యార్థులు

యూనివర్సిటీ పరిఽధిలో మొత్తం 118 కళాశాలలుండగా విద్యార్థుల ఆదరణ లేక సగానికిపైగా కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న 64 డిగ్రీ కళాశాలల్లో మూడు సంవత్సరాలకు కలిపి సుమారు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఉన్న మూడు అటానమస్‌ కళాశాలల్లో పరీక్షలు పూర్తి కాగా ఎంజీయూ పరిధిలోని కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు గతంలోనే వాయిదా పడగా, వార్షిక పరీక్షలు మూడుసార్లు వాయిదా వేశారు.

ఆరువేల మంది ఫైనలియర్‌

విద్యార్థులపై ప్రభావం

ఎంజీయూ పరిధిలో డిగ్రీ ఫైనలీయర్‌ చదువుతున్న విద్యార్థలు 6 వేలమంది వరకు ఉన్నారు. వీరు డిగ్రీ పూర్తిచేసుకుని పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే డిగ్రీ పరీక్షలు పూర్తికాకపోవడంతో పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్‌ కాలేని పరిస్థితి. దీంతో తాము విద్యా సంవత్సరం నష్టపోతామని ఫైనలియర్‌ విద్యార్థులు అంటున్నారు.

ప్లాన్‌–బీ రెడీ చేస్తున్నారా..?

డిగ్రీ పరీక్షల నిర్వహణకు ప్రైవేట్‌ యాజమాన్యాలు సహకరించకపోతే వర్సిటీ అధికారులు ప్లాన్‌–బీ రెడీ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరీక్షలు మళ్లీ వాయిదా వేస్తే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రానుందని, అవసరమైతే ప్లాన్‌–బీని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.

దోస్త్‌కు దూరంగా కళాశాలలు..

నాలుగేళ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న డిగ్రీ కళాశాలలు ఈ విద్యాసంవత్సరం(2025–26)లో ఫస్టియర్‌ అడ్మిషన్లు తీసుకోవడానికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన దోస్త్‌కు దూరంగా ఉంటున్నాయి. దాదాపు 20 కళాశాలలు ఫస్టియర్‌ అడ్మిషన్లు తీసుకోవడం లేదని సమాచారం. భవనాల అద్దెలు, కరెంట్‌ బిల్లులు, అధ్యాపకుల వేతనాలు ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నందున మూసివేతకే వీరు మొగ్గుచూపుతున్నారు.

ఫ పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఎంజీ యూనివర్సిటీ

ఫ సహకరించేది లేదంటున్న ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు

ఫ దగ్గర పడుతున్న పీజీ ప్రవేశ పరీక్షలు

సహాయ నిరాకరణ కొనసాగిస్తాం..

నాలుగేళ్లుగా డిగ్రీ కళాశాలలకు సుమారు రూ.120 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి. అప్పటి వరకు పరీక్షల విషయంలో మా సహాయ నిరాకరణ కొనసాగిస్తాం.

– మారం నాగేందర్‌రెడ్డి, ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం సంఘం జిల్లా అధ్యక్షుడు

సమస్య పరిష్కారం అవుతుంది

విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా పరీక్షల నిర్వహణకు సహకరించాలని ప్రైవేట్‌ యాజమాన్యాలను కోరుతున్నాం. సోమవారం వరకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. పరీక్షలు నిర్వహణకు రెడీగా ఉన్నాం. విద్యార్థులు కూడా పరీక్షలకు సిద్ధం కావాలి. – ఉపేందర్‌రెడ్డి,

కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌, ఎంజీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement