యాసంగి సాగు జోరు
సిద్ధంగా యూరియా..
భానుపురి (సూర్యాపేట) : యాసంగి సాగు జోరుగా సాగుతోంది. ప్రధానంగా వరినాట్లు ముమ్మరం అయ్యాయి. బోరుబావులతో పాటు సాగర్, మూసీ ఆయకట్టులకు నీటిని విడుదల చేయడంతో సాగు పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు సాగు అంచనాలో 90 శాతం పూర్తి కానుంది. ఇక వేరుశనగ, పెసర పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తే సాగు పనులు ముమ్మరం కానున్నాయి. ఈ ప్రాంతంలోనే చివరగా నాట్లు పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
నెలరోజులుగా బిజీబిజీ
నవంబర్ 15 నుంచే జిల్లాలో యాసంగి సీజన్ పనులను రైతులు ప్రారంభించారు. వానాకాలం అత్యధికంగా వరి సాగు చేయగా.. యాసంగిలోనూ ఇదే పంట కోసం రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. వరి గడ్డి పోగు చేయడమే కాకుండా (ఎలగడ) దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. విత్తనాల కొనుగోలు, నారుమడులు సిద్ధం చేసుకోవడం.. ఇలా ఒక్కో పనులను పూర్తి చేసుకుని ఈనెల 15 నుంచి వరినాట్లు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లోని బోరుబావుల కింద జోరుగా నాట్లు సాగుతున్నాయి. చాలామంది రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. రైతులంతా ఒకేసారి నార్లు పోయడంతో కూలీల కొరత మొదలైంది. నాట్లు సకాలంలో వేయకుంటే ముదిరిపోయి దిగుబడి తగ్గుతుందనే ఆందోళనలో ఉన్నారు.
ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం..
తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు దాదాపు 2.20 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల వరకు ఈ ఆయకట్టు కింద వరి సాగు జరుగుతోంది. అయితే నీటి విడుదల కోసం ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నీటి షెడ్యూల్ విడుదల చేయడంతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. తెలిసిన వారి వద్ద నార్లు అడగడం, లేదంటే డ్రమ్‌సీడర్ విధానంలో సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికే నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ ఆయకట్టుకు నీటి విడుదల చేస్తే సాగు పనులు ముమ్మరం కావడమే కాకుండా కూలీల కొరత రానుంది. దాదాపు సంక్రాంతి వరకు కూడా ఈ ప్రాంతంలో వరి నాట్లు కొనసాగే అవకాశం ఉంది.
వానాకాలం సీజన్‌లో రైతులు యూరియా కోసం చాలా తిప్పలు పడ్డారు. ఇలాంటి పరిస్థితి యాసంగి సీజన్‌లో రాకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతాంగానికి సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే యాసంగి సీజన్ నిమిత్తం దాదాపు 31వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశారు. మరో 30వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు జిల్లాకు అందుతోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న యూరియా మొదటి సారికి సరిపోతుందని, రానున్న రోజుల్లో వచ్చే యూరియాతో ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం రావని అధికారులు పేర్కొంటున్నారు.
ఫ ఇప్పటివరకు 2.80 లక్షల
ఎకరాల్లో నాట్లు
ఫ బోరుబావుల కింద జోరుగా
వ్యవసాయం
ఫ మూసీ, సాగర్ ఆయకట్టులోనూ ముమ్మరంగా పనులు
ఫ యాసంగి సాగు అంచనా
4.82 లక్షల ఎకరాలు


