నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాక
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలోని జీవీవీ గార్డెన్‌లో సోమవారం నిర్వహించే సీపీఎం జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరుకానున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతోపాటు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించేందుకు కార్యకర్తలకు అవసరమైన సూచనలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. అనంతరం ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సీపీఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సూర్యక్షేత్రంలో వైభవంగా మహా సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.
ముకువారు నవల ఆవిష్కరణ
అనంతగిరి: మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గల గీతా మందిరంలో ఆదివారం సాహితీ కళాపీఠం ఆధ్వర్యంలో ముకువారు నవల పుస్తకాన్ని సర్పంచ్ గోపతి లలితమ్మ ఆవిష్కరించారు. నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, రచయిత దాసరి లింగస్వామి ఈ నవలను రచించడం అభినందనీమన్నారు. కార్యక్రమంలో సాహితీ కళాపీఠం అధ్యక్షుడు లింగమూర్తి, కృష్ణమూర్తి, గోపతి లక్ష్మణ్, సతీష్, హుస్సేన్, ఉపేందర్, బొంకురి భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాక


