విలపించిన పుల్లెంల
గట్టుప్పల్,చండూరు : పుల్లెంల కన్నీటి సంద్రమైంది. నా బిడ్డ హనుమంతు ఎటుపోయిండని బోరున విలపించింది. ఒడిశా రాష్టంలో ఈనెల 25న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు ఆలియాస్ గణేష్ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన పుల్లెంలకు చేరుకుంది. ఆయన కడసారి చూపు కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామాన్ని ముందుగానే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నా.. ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉదయం నుంచే గ్రామంలో ఎదురు చూశారు. అంబులెన్స్‌లో ఆయన పార్థివదేహం వచ్చాక ప్రజలు ఎర్ర జెండాలు చేతబూని అంబులెన్స్‌పై పూలు చల్లుతూ ర్యాలీగా హనుమంతు ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా హనుమంతు ఇంటి దగ్గరకు పరుగులు పెట్టారు. ఆయన పార్థివదేహాన్ని చూపిన జనం బోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ఆయనకు ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ‘జోహార్ హనుమంతు’ నినాదాలతో ఆయన అంతిమయాత్ర గ్రామంలో మూడు గంటలపాటు సాగింది.
ఫ అశ్రునయనాలతో మావోయిస్టు నేత హనుమంతుకు అంతిమ వీడ్కోలు
విలపించిన పుల్లెంల


