బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సిద్ధం కావాలి
సూర్యాపేటటౌన్ : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ సభ విజయవంతానికి సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ ఉంటుందని, కేటీఆర్ పిలుపుతో స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని, అతి తక్కువ సమయంలో వైఫల్యం చెందిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్‌రెడ్డి పాలన ఉందన్నారు. నెరవేర్చలేని హామీలతో కాంగ్రెస్ అభాసుపాలయిందని, అన్ని రంగాల ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని విమర్శించారు. రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదు.. రైతు బీమా లేదు.. రుణమాఫీ పూర్తికాలేదని మండిపడ్డారు. నీళ్లు లేక ఎండిన పంటలు.. చేతికొచ్చిన ఎంతోకొంత పంటకు మద్దతు ధరలేక అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, రైతాంగం ఇలా అన్ని రంగాల్లో ఎవరి నోట విన్నా నేడు కేసీఆర్ మాటే వినిపిస్తోందని చెప్పారు. ఆత్మకూర్.ఎస్ మండలం మంగళితండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు 70 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు రిటైర్డ్ ఉద్యోగి నరసింహచారి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, వై.వి, పెరుమాళ్ల అన్నపూర్ణ పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి


