మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌శాంతి, సామరస్యాలకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరారు. ప్రశాంతవతావరణంలో ఐక్యతతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ కోరారు. బుధవారం సూర్యాపేట సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. జైలు పరిసరాలు, మధ్యాహ్న భోజనం, ఖైదీల గదులను పరిశీలించారు. అనంతరం వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఖైదీలు డీఎల్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు.ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు ,పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
జలవనరుల శాఖ సీఈకి ఈఎన్‌సీగా పదోన్నతి
ఖమ్మంఅర్బన్ : సూర్యాపేట జిల్లా జలవనరుల శాఖ సీఈగా, ఖమ్మం ఇన్‌చార్జి సీఈగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమేష్‌బాబుకు పదోన్నతి లభించింది. ఆయనకు జల వనరుల శాఖలో ఈఎన్‌సీ(అడ్మిన్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన పదోన్నతితో రెండు జిల్లాల సీఈ పోస్టులు ఖాళీ కాగా, త్వరలోనే మరో అధికారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మద్యం మత్తులో ఏఎన్‌ఎంపై సీహెచ్‌ఓ దాడి
చివ్వెంల(సూర్యాపేట) : మద్యం మత్తులో ఏఎన్‌ఎంపై సీహెచ్‌ఓ దాడి చేశాడు. ఈ ఘటన చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆవుల వెంకటేశ్వర్లు జి.తిర్మలగిరి గ్రామంలోని సబ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం పట్ల మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు. కొంతమంది స్థానికులు గమనించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో మండల వైద్యాధికారి జి. భవాని జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో సీహెచ్‌ఓ ఆవుల వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారి పెండెం వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు


