కేసులు సత్వరం పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరితగతిన వినియోగదారుల కేసులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినియోగదారుడు మార్కెట్‌లో వస్తువు కొనుగోలు చేసే సమయంలో ఏది మంచో ఏది చెడో గ్రహించాలన్నారు. వ్యాపారులు తమ లాభార్జన కోసం తప్పుడు ప్రకటనలు, ఆఫర్లు ప్రకటిస్తారని, వాటిని చూసి అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం డిజిటల్, ఆన్‌లైన్ నేరాలు పెరిగిపోయాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారుడు మోసపోయినట్లయితే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి సత్వర న్యాయం పొందాలన్నారు. డీసీఐసీ కమిషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారులు నేరుగా కేసును దాఖలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా అధికారి మోహన్‌బాబు, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, సివిల్ సప్లయ్ మేనేజర్ రాము, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, కమిషన్ సభ్యుడు ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు


