బిల్లులిస్తారా సారూ!
రూ.15వేల నుంచి
రూ.40వేల వరకు ఖర్చు..
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పాలకవర్గాలు కొలువు దీరాయి. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆశలు చిగురించాయి. కానీ రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో అప్పులు చేసి గ్రామాభివృద్ధిలో నిధులు ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ఈ ఎన్నికలు ఆర్థిక భారాన్ని మిగిల్చాయి. పంచాయతీ ఎన్నికల్లో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ కార్యదర్శులు రూ.15నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు మాత్రం రూ.5నుంచి రూ.7వేల వరకే చెల్లించారు. మిగతా డబ్బంతా తాము జేబు నుంచి పెట్టుకోవాల్సివచ్చిందని కార్యదర్శులు వాపోతున్నారు. ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయకుండా బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు.
మూడు విడతల్లో ఎన్నికలు..
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో మొదటి విడత 159 జీపీలు, రెండోవిడతలో 181, మూడోవిడతలో 146 జీపీల చొప్పున ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యత ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులదే. పోలింగ్ కేంద్రాల్లో శానిటేషన్ నుంచి విద్యుత్, తాగునీరు, పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు, టేబుళ్లు.. ఇలా ప్రతిదీ పంచాయతీ కార్యదర్శులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా పోలింగ్‌కు ముందురోజు రాత్రే పోలింగ్ కేంద్రాలకు వచ్చే పోలింగ్ సిబ్బందికితిరిగి వెళ్లే వరకూ టీ నుంచి టిఫిన్లు, భోజనాల బాధ్యతలూ వీరివే.
ఓటర్ల ఆధారంగా సిబ్బంది..
గ్రామంలో ఉండే ఓటర్ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తోంది. పోలింగ్ స్టేషన్‌లో 200 మంది ఓటర్ల కన్నా తక్కువ ఉంటే ఇద్దరు, ఎక్కువ ఉంటే ముగ్గురు చొప్పున పీఓ, ఏపీఓలను నియమించారు. ఇలా చిన్న గ్రామపంచాయతీలో 6 వార్డులు ఉంటే పీఓలు, ఏపీఓలే కాకుండా వెబ్ కాస్టింగ్, స్టేజ్ –2 అధికారి, పోలీస్ సిబ్బంది ఇలా 25 మంది దాకా ఎన్నికల విధుల్లో ఉంటారు. అదే మేజర్ గ్రామపంచాయతీ అయితే ఒక్కో గ్రామంలో 12 వార్డులైతే 48 మంది, 14 వార్డులైతే 60 మంది ఉంటారు. ఎన్నికల నిర్వహణ లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లోవసతులు కల్పించ డం, పోలింగ్ సిబ్బందికి భోజనాల, స్నాక్స్ ఖర్చుల కింద ఎన్నికల సంఘం, ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రానికి రూ.500 చొప్పున కేటాయించారు.
జిల్లాలోని 486 గ్రామపంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రధానంగా లైటింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాల్సి ఉంది. అలాగే శానిటేషన్, టెంట్లు, మంచినీరు, టేబుళ్లు ఇలా ఇవే దాదాపు రూ.10వేల వరకు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ రోజుకు ముందు రాత్రి వచ్చే ఎన్నికల సిబ్బందికి రాత్రి భోజనం, ఉదయం ఆరుగంటలకే టీ, టిఫిన్, తిరిగి 11 గంటలకు టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5గంటలకు బిస్కెట్స్, టీ అందించారు. ఈ భోజనాలు, టీ, టిఫిన్, స్నాక్స్ ఖర్చు భారీగా వచ్చినట్లు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. చిన్న గ్రామపంచాయతీలకు రూ.10వేల దాకా, మేజర్ గ్రామపంచాయతీలకు రూ.20నుంచి రూ.30వేల వరకు వీటికే ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం వార్డుకు రూ.500ల చొప్పున లెక్క కట్టి రూ.6నుంచి రూ.7వేల వరకు ఎంపీడీఓల చేతుల మీదుగా కార్యదర్శులకు అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులపై దాదాపు రూ.10 నుంచి రూ.20వేల వరకు అదనపు భారం పడినట్లయింది.
ఫ పంచాయతీ ఎన్నికల్లో రూ.15వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు
ఫ మౌలిక వసతుల కల్పన, భోజనాలు, టీ, స్నాక్స్‌కు వినియోగం
ఫ చేతినుంచి పెట్టుకున్న పంచాయతీ కార్యదర్శులు
ఫ ఒక్కో పంచాయతీకి కేవలం రూ.5వేలు చెల్లింపు
ఫ ఇప్పటికే అప్పుల పాలయ్యాం.. మిగతావి చెల్లించాలని వేడుకోలు


