మహిళా సౌరభం
మోత్కూరు :
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజరు భూములతో లీజు ఒప్పందం చేసుకొని పరస్పర అంగీకారంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో దేవాదాయ భూములను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. ఈ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి. వీరారెడ్డి, ఆర్డీఓ ఎం. కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ కె. నాగిరెడ్డితో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ నెల 19న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే బుజిలాపురం సోలార్ పవర్ ప్లాంట్ మొదటిదని అధికారులు చెబుతున్నారు.
బుజిలాపురంలోని 8 ఎకరాల దేవాదాయ భూమిలో రూ.6 కోట్లతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వామన సోలార్ ఈపీసీ కంపెనీ ద్వారా ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక్కో ఎకరాకు రూ.15వేల చొప్పున డీఆర్‌డీఏ ద్వారా చెల్లించడానికి మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో జమవుతాయి. జిల్లా మహిళా సమాఖ్య, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల మహిళా సమాఖ్యలు కలిసి రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక మెగావాట్‌కు రూ.3 కోట్ల చొప్పున 2 మెగావాట్లకు కలిపి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 10 శాతం అనగా రూ.60 లక్షలు, మహిళా సంఘాల వాటా 1 మెగావాట్ యూనిట్‌కు రూ.కోటి ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల యూనిట్లకు గాను రూ.2కోట్ల రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల ద్వారా సంవత్సరానికి రూ.16.60 లక్షల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1 యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 చెల్లించి తెలంగాణ రెడ్‌కో కొనుగోలు చేస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం రూ.52 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మహిళా సంఘాలు బ్యాంకు రుణం, వాయిదాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్ జీవిత కాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది.
అన్ని ఏర్పాట్లు చేశాం
బుజిలాపురంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. రెవెన్యూ అధికారుల సహకారంతో 8 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని లీజుకు తీసుకున్నాం. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా వాటా ధనం చెల్లించాం. అన్నిరకాల ఒప్పందాలను కంపెనీతో కుదుర్చుకున్నాం. సోలార్ పవర్ ప్లాంట్‌తో మహిళా సంఘాలకు పెద్దఎత్తున ఆదాయం చేకూరనుంది.
– టి. నాగిరెడ్డి, డీఆర్‌డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా
జీవనోపాధి పొందుతాం
సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో జీవనోపాధి పొందుతాం. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నాం. దీంతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పడం సంతోషంగా ఉంది.
– మిడిదొడ్డి శైలజ, మోత్కూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
అదృష్టంగా భావిస్తున్నాం
యాదాద్రి జిల్లా మహిళా సమాఖ్యకు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బుజిలాపురంలోనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఓ అధికారుల కృషి ఎంతో ఉంది. జిల్లా అధికారులకు మహిళా సంఘాల పట్ల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
– కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, యాదాద్రి భువనగిరి
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల
ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం
రాష్ట్రంలోనే రప్రథమంగా మోత్కూరు మండలం
బుజిలాపురంలో శంకుస్థాపన
మహిళా సౌరభం
మహిళా సౌరభం
మహిళా సౌరభం
మహిళా సౌరభం


