అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
భువనగిరి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన శ్రీరాం కుమార్ మూడో కుమారుడు రామకృష్ణ(22) బుధవారం ఉదయం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ గేదెలకు పాలు పితికి ఇంటికి వెళ్లి పాలు పెట్టిన తర్వాత మళ్లీ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి వద్ద పశువులను మేత కోసం వదిలి వాటి వెనుక నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు కిందపడి ఉండటాన్ని సోదరుడు గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.


