పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి
● మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన
చిట్యాల : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్‌ని గతేడాది మేడ్చల్‌లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్‌ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది.
పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి
నాగార్జునసాగర్ : రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగార్జునసాగర్‌లో నూతనంగా నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 30, 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించి తాము దాచుకున్న డబ్బులను అవసరాల మేరకు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షన్ అనేది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సేవకు పొందే లబ్ధి హక్కు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గానోతుల వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, నారాయణరెడ్డి, పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, గోవర్థన్‌రెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు.
చిట్యాలలో పత్తి రైతుల ఆందోళన
చిట్యాల : పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలని చిట్యాల పట్టణ శివారులో సీసీఐ ఏర్పాటు చేసిన క్రిష్ణ కాటన్ మిల్లు వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ మిల్లు వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర పత్తి లోడు ట్రాక్టర్లు ఉండడంతో చిట్యాల నుంచి మునుగోడు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇదే సమయంలో పత్తి కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు చిట్యాల–ఉరుమడ్ల రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు సీసీఐ కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఐదు క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకుని అదనంగా పత్తిని రైతులు తీసుకురావడంతో కొనుగోళ్లలో ఆలస్యమై ట్రాక్టర్లు బారులదీరినట్లు తెలుస్తోంది. పోలీసులు కాటన్ మిల్లు వద్దకు చేరుకుని రైతుల ఆందోళనను విరమింపజేశారు. సీసీఐ కేంద్రం అధికారి కోటేశ్వరరావు, కాటన్ మిల్లు నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో శాంతించారు. సాంకేతిక సమస్యలతో అదనంగా స్లాట్ బుక్ అయినట్లు సీసీఐ కేంద్రం అధికారి పేర్కొన్నారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కోదాడరూరల్ : బైక్‌పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని దోరకుంటకు చెందిన జక్కుల శివ(45) పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోదాడ బస్టాండ్ వద్దకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా. ఖమ్మం క్రాస్‌రోడ్ వద్ద మేళ్లచెర్వు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తమ్ముడు కొండలు ఫిర్యాదు మేరకు సీఐ కె. శివశంకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం


