హత్య కేసులో నిందితుడి రిమాండ్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మేనమామను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్న యలగందుల వెంకన్న(50) తన కుమారుడు రాకేష్‌తో కలిసి స్థానికంగా మిల్క్ సెంటర్ నడుపుకుంటున్న తన మేనల్లుడు గట్టు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 21న రాత్రి వెళ్లారు. వెంకన్న కూమారుడు రాకేష్ శ్రీకాంత్ వద్ద పాల వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ షాపులోనే అతడి స్నేహితుడైన చీమలగడ్డకు చెందిన పుట్ట కిరణ్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. వెంకన్న తన కుమారుడు రాకేష్‌కు రావాల్సిన జీతం డబ్బుల గురించి శ్రీకాంత్‌ను ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ అసభ్య పదజాలంతో వెంకన్నను దూషిస్తూ డబ్బులు ఇవ్వనని బెదిరించాడు. దీంతో వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్‌పై చేయి ఎత్తడానికి ప్రయత్నించగా.. రాకేష్ అడ్డుగా వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. మరింత ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ పక్కనే ఉన్న పాల ట్రేతో రాకేష్‌పై దాడి చేయబోగా.. వెంకన్న అడ్డురావడంతో అతడి తలపై పాల ట్రేతో కొట్టి గాయపర్చాడు. అంతేకాకుండా సిమెంట్ ఇటుకతో వెంకన్న ముఖంపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత వెంకన్న కుమారుడు రాకేష్, పుట్ట కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టపక్కల వారు వచ్చి వెంకన్నను అంబులెన్స్‌లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకన్న కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గట్టు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్‌రెడ్డి, వెంకటేశం, ఎస్‌ఐ వీరబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


