సమాజంలో నాణ్యమైన విద్య, వైద్యం అవసరం
కోదాడ: సమాజంలో నాణ్యమైన విద్య, వైద్యం అవసరమని పాలక ప్రభుత్వాలు ఈ రెండింటినీ ఉచితంగా అందించాలని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. బుధవారం కోదాడ పబ్లిక్‌క్లబ్ ఆవరణలో వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యలో అంతరాలకు పాలకుల విధానాలే కారణమన్నారు. కవులు, రచయితలు ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ కొరవడిందన్నారు. సమాజాని నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి పౌరస్పందన వేదిక కృషి చేస్తోందన్నారు. దీనికి రచయితలు, కవులు తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. పలువురు కవులు, రచయితలు కవితలను వినిపించారు. ఈ సమావేశంలో పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్. ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఏ. మంగ, రమణ, రామ్మూర్తి, అనిల్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, ఆంజనేయులు, పుప్పాల కృష్ణమూర్తి, వీరాచారి, ఖాజామియా, దండాల మధుసూధన్‌రెడ్డి, హమీద్ పాల్గొన్నారు.


