ఏరు.. తోడేస్తుండ్రు
ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేస్తాం
మోతె: ఇసుక దందా ఆగడంలేదు. కొందరు అక్రమార్కులు కూడలి గ్రామంలోని ఏరును తోడేస్తున్నారు. ఇసుకను యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
కూడలి గ్రామ సమీపంలో..
కూడలి గ్రామం సమీపంలో ఏరు ఉంది. ఇందులో నీరు నిల్వ ఉన్నప్పటికీ కొందరు అక్రమార్కులు అందులోకి దిగి ఇసుకను తవ్వుతున్నారు. ఏరుకు చుట్టు పక్కల ఉన్న నర్సింహాపురం, రంగాపురంతండా, సర్వారం, రావికుంటతండా తదితర గ్రామాలకు చెందిన కొందరు ఇసుకదందాకు అలవాటు పడి ప్రకృతి సందపను దోచుకుంటున్నారు.
మోతె మండలానికి సరిహద్దున ఉన్న జిల్లాలకు..
కొందరు ఈ ఇసుకను ఏరు ఒడ్డున కుప్పగా పోసి ఆ తర్వాత ట్రాక్టర్లలో నింపుతుండగా ఇంకొందరు డైరెక్ట్‌గా ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు. రోజూ 90 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. మోతె మండలానికి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, వరంగల్ పరిధిలోని గ్రామాలతో పాటు సూర్యాపేట పట్టణానికి ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు మాత్ర హడావుడి చేసి నామమాత్రంగా రెండు, మూడు ట్రాక్టర్లు పట్టుకొని కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే.
అతివేగంతో ట్రాక్టర్లు
కూడలి–సూర్యాపేట రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై ఇసుక ట్రాక్టర్లు తీవ్ర వేగంతో ప్రయాణించడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోంది. అధికారులు చొరవ చూపి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలి
కూడలి ఏరు నుంచి అక్రమంగా ఇసుక తరలించకుండా ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఇసుకను ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలంటున్నారు.
ఫ కూడలి గ్రామంలోని ఏరు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా
ఫ రోజూ 80 ట్రాక్టర్ల వరకు తరలింపు
ఫ ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.7వేలకు విక్రయం
కూడలి గ్రామంలోని ఏరులో ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తాం. తద్వారా వినియోగదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా చేయడానికి సులువు అవుతుంది. ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం నుంచి గానీ మైనింగ్ శాఖ నుంచి గానీ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు
– ఎం. వెంకన్న, తహసీల్దార్, మోతె
ఏరు.. తోడేస్తుండ్రు


