
కాంటాలు వేయడంలో జాప్యం వద్దు
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
కోదాడరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయడంలో జాప్యం చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో నల్లబండగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కాంటాలు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ బస్తాలు, మిల్లుల ట్యాగులు కాక ఆలస్యం అవుతోందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, స్థానిక పీఏసీఎస్ చైర్మన్ కొత్తా రఘుపతి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డీసీఓ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బస్తాలు, ట్యాగులు పంపించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యానారాయణ, తహసీల్దార్ వాజిద్‌అలీ, కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, సీఈఓ జొన్నలగడ్డ జయకృష్ణ, రైతులు ఉన్నారు.
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : సహకార సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కోఆపరేటివ్ అభివృద్ధి కమిటీ, జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్, సోలార్ యూనిట్స్, ఐస్ ప్రాజెక్ట్‌లపై పీఏసీఎస్‌ల ద్వారా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. పీఏసీఎస్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లపై శిక్షణ ఇప్పించి వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పీఏసీఎస్ చింతలపాలెంలో కోల్డ్ స్టోరేజ్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీసీఓ పద్మ, నాబార్డ్ ఏజీఎం ఎన్. సత్యనారాయణ, డీసీసీబీ సీఈఓ ఆర్. శంకర్‌రావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్, ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య పాల్గొన్నారు.