ఇక 30 మండలాల్లో 536 ఎంపీటీసీలే..
నేటితో ముగియనున్న ఎంపీటీసీల
పదవీకాలం
మూడేళ్లుగా అందని వేతనాలు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
అగౌరవంతోనే..
హిరమండలం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లపాటు క్షేత్రస్థాయిలో ప్రజాసేవకే అంకితమైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం నేటితో ముగియనుంది. అయితే పదవీకాలం పూర్తిచేసుకుని ఇంటికి వెళ్తున్న తరుణంలోనూ వారికి ప్రభుత్వం నుంచి సముచిత గౌరవం దక్కడం లేదు. చంద్రబాబు సర్కారు గౌరవేతనాలు అందించకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 30 మంది జెడ్పీటీసీ సభ్యులు, 536 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారికి ప్రతినెలా రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండు విడతల్లో గౌరవ వేతనం చెల్లించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరో విడత ఎంపీటీసీలకు వేతనాలు చెల్లించలేకపోయింది. అయితే అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి అంతకుముందు పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు దాదాపు మూడేళ్ల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈరోజుతో ఎంపీటీసీల పదవీకాలం ముగియనుంది. కానీ ఇప్పటికీ తమకు రావాల్సిన వేతనాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీపై అక్కసుతో..!
గత ఎన్నికల్లో ఎక్కువ శాతం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కారణంతోనే కూటమి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించకుండా చిన్నచూపు చూస్తోందని పలువురు ఎంపీటీసీలు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులకు వివరణ కోరగా ఎంపీటీసీల గౌరవ వేతనాలకు సంబంధించి జిల్లా అధికారులకు బిల్లులు పంపామన్నారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేసిన వెంటనే వారి ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.
అరసవల్లి: ఇప్పటివరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 667 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగేవి. అయితే జిల్లాల పునర్విభజన కారణంగా రాజాం నియోజకవర్గంలోని రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాల్లోని మొత్తం 65 ఎంపీటీసీలు విజయనగరం జిల్లా పరిధిలోకి, అలాగే పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల్లోని 60 ఎంపీటీసీలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి చేరాయి. దీంతో మొత్తం 125 ఎంపీటీసీ స్థానాలు మన జిల్లా నుంచి వేరుపడడంతో జిల్లాలో ఇక నుంచి 30 మండలాల్లో 536 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు.
రేపటితో జెడ్పీటీసీల పదవీకాలం ముగింపు
ఉమ్మడి జిల్లాలో 38 మండలాల్లో 38 జెడ్పీటీసీలకు 2021లో స్థానిక ఎన్నికలు జరుగగా.. ఏకంగా హిరమండలం మినహా మిగిలిన 37 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలన్నీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా కవిటి మండల జెడ్పీటీసీ పిరియా విజయ ఎన్నికయ్యారు. వీరంతా 2021 సెప్టెంబర్ 25న పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో వీరి పదవీ కాలం గురువారంతో ముగియనుంది. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన కారణంగా రాజాం నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీలు విజయనగరం జెడ్పీ పరిధిలోకి, పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. ఈనెల 25 నుంచి పార్వతీపురం జిల్లాకు కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని మొత్తం 8 జెడ్పీటీసీ స్థానాలు ఇక శ్రీకాకుళం జిల్లా పరిషత్‌లో ఉండవు. దీంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో జిల్లాలో 30 మండలాల్లోని 30 మంది జెడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.


