‘కోరమండల్‌పై స్పష్టత ఇవ్వాల్సిందే’ | - | Sakshi
Sakshi News home page

‘కోరమండల్‌పై స్పష్టత ఇవ్వాల్సిందే’

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

సంతబొమ్మాళి: కోటపాడు గ్రామంలో కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ పరిశ్రమ ఏర్పాటుపై గురువారం గ్రామ సభ నిర్వహించారు. పరిశ్రమ నిర్మాణానికి సుమారు 400 ఎకరాలకు పైగా భూమి అవసరమని అధికారులు పేర్కొనగా.. రైతులు పలు సందేహాలు, సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఇక్కడ రా మెటీరీయల్‌ తయారవుతుందా? లేక ఎరువుల ఉత్పత్తి జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. రా మెటీరియల్‌ తయారీ జరిగితే కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందని, సుమారు ఐదు కిలోమీటర్లు పరిధిలో గాలి, నీరు, భూమిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు అందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ నీటిని రీ సైక్లింగ్‌ చేసి పంపాలని కోరారు. రైతుల పొలాల్లో పరిశ్రమ నిర్మాణం కోసం భూమిని ఎత్తు చేయడం వల్ల చుట్టు పక్కల ఉన్న పొలాల్లోకి వర్షపు నీరు చేరి ముంపు సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక డ్రైనేజీ మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో స్పష్టం చేయాలని రైతులు ప్రశ్నించారు. స్కిల్‌ లేని స్థానిక యువతకు ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఉద్యోగాల్లో వారికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో వెల్లడించాలని కోరారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ స్కిల్డ్‌ ఉద్యోగాల కోసం స్థానిక యువతకు ఇతర ప్రాంతాల్లో శిక్షణ ఇప్పించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హేమసుందరరావు, రైతులు కోత మధుసూధనరావు, కోత సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement