● మాజీ సభాపతి తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: డీఎస్సీ నియామక ప్రక్రియపై వస్తు న్న ఆరోపణలు, అభ్యర్థుల ఫిర్యాదులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సమగ్రంగా పరిశీలించాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ వివాదంపై ప్రభుత్వం రాజకీయ విమర్శలతో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా యువతకు సమాధానం చెప్పాలని సూ చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యో గ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేశామని, గ్రామ, వార్డు సచివాలయ నియామకాలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాలపై అనేక సందేహా లు, ఫిర్యాదులు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు కల్పించేందుకు జీఓ తీసుకువచ్చి, నియామకాలు పూర్తయిన తర్వాత అదే జీఓను రద్దు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఉద్యోగాల కోసం బేరాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ధ్రువీకరణ ప త్రాల పరిశీలన సక్రమంగా జరిగిందా? అర్హత లేని వారు ప్రయోజనం పొందారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో వస్తున్న ఆరోపణలను కూడా ప్రభు త్వం తేలికగా తీసుకోకూడదన్నారు. ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదని, ఒకరి హక్కును మరొకరికి అక్రమంగా బదిలీ చేసే పరిస్థితి రాకూడదని తెలిపారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై శాసనమండలిలో చర్చకు రావాలని తమ పార్టీ సవా ల్ చేసినప్పుడు అధికార కూటమి సభ్యులు చర్చకు ముందుకు రాలేదని తమ్మినేని విమర్శించారు. శాసనమండలిలో డీఎస్సీ అవకతవకలపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కూడా అదే ధైర్యంతో ముందుకు రావాలని సవాల్ చేశారు.
మీడియాలో వస్తున్న కథనాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని తమ్మినేని సూచించారు. డీఎస్సీ వివాదంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజం కాదని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు. నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపడం, అక్రమాలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసు కోవడం, వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయడం తమ డిమాండ్లని స్పష్టం చేశారు.


