కొత్త పేరు.. అంచనాలు తారుమారు | - | Sakshi
Sakshi News home page

కొత్త పేరు.. అంచనాలు తారుమారు

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జిగా

ఊహించని వ్యక్తి

ఆశావహులకు నిరాశ

రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్‌.ఈశ్వరరావు కొనసాగుతుండగానే.. టీడీపీ కొత్త కుంపటి పెట్టింది. ఇక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేడని టీడీపీ శ్రేణులు రెండేళ్లుగా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి పదవిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి లేదంటే అతని కుటుంబ సభ్యులకే కేటాయించాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తదుపరి నియోజకవర్గంలో కీలకమైన నాయకులుగా ఉన్న చౌదరి బాబ్జి, ముప్పిడి సురేష్‌, పిన్నింటి భానోజీనాయుడులు తమకే ఇన్‌చార్జి కేటాయించాలని రాష్ట్ర స్థాయిలో పైరవీలు, లాబీయింగ్‌లు బలంగానే చేశారు. ఇటీవల భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర అంతా స్వాగత ఫ్లెక్సీలు, ఇతర ఏర్పాటు చేసి తమ ఉనికి చాటుకునే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా టీడీపీ పార్టీ అభిప్రాయ సేకరణలో ప్రధానంగా వీళ్ల పేర్లే వచ్చాయి.

ఉహించని వ్యక్తికి అందలం

కానీ ఎవరూ ఊహించని విధంగా లంక శ్యామల రావు పేరు చివరిలో తెరపైకి వచ్చింది. ఆయన నియామకం వెనుక ఎవరి హస్తం ఉందోనని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అంతర్మథంలో పడ్డాయి. ‘లంక’ రణస్థలం మండల పార్టీ అధ్యక్ష పదవికే అనర్హుడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా కాపు సామాజిక వర్గం వ్యక్తులు తప్ప ఇతర సామాజిక వర్గాలైన కాళింగ, తెలగ, మత్స్యకార నాయ కులు పనికి రారా అంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ సామాజిక వర్గ క్రేడర్‌ మదనపడుతున్నారు.

లంక శ్యామలరావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఏడాదికే ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ టీడీపీకి వచ్చి, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జెడ్పీటీసీ అభ్యర్థిగా ఓడిపోయారు. ప్రతిపక్ష పార్టీ నాయకులతోనే ఎక్కువ సంబంధాలు ఉన్న శ్యామ్‌ ఈ పదవికి ఏవిధంగా అర్హుడంటూ బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఎప్పుడూ పార్టీ కోసం కష్టపడిన దాఖలాలు లేవని విమర్శలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ కోట్లు ఖర్చు చేసిన తెలగ, కాళింగ, ఇతర సామాజిక వర్గాల నేతలు తీవ్ర నిరాశతో అంతర్మథనంలో పడి మిన్నకుండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement