దద్దరిల్లిన విశాఖ | - | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన విశాఖ

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం.. ఆర్టీసీ కాంప్లెక్స్‌ దిగ్బంధం

రెండు రోజుల నిరసనకు స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన ఉద్యోగులు

ప్రభుత్వ తీరుపై మండిపాటు

ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రధాన జంక్షన్‌లో రాస్తారోకో

నినాదాలతో హోరెత్తిన ప్రాంతం..

స్తంభించిన ట్రాఫిక్‌

పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత.. వెనక్కి తగ్గని ఉద్యోగులు

జీఓ నంబర్‌ 11 రద్దు చేయాలి

జీఓ నంబర్‌ 11 వల్ల మా ఉద్యోగ భద్రత దెబ్బతింటోంది. ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీలు చేస్తూ సర్వీసును అస్థిరంగా మార్చుతున్నా రు. గ్రామాల్లో అన్ని ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నా జేఏసీలో కూడా ప్రాతినిధ్యం లేదు. పెండింగ్‌లో ఉన్న రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్‌ బకాయిలు వెంటనే మంజూరు చేయాలి. సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్‌ సందేశాలతో ఒత్తిడి చేయడం ఆపాలి. మేము ఉద్యోగులం.. యంత్రాలం కాదు.

–సాంబమూర్తి, డిజిటల్‌ అసిస్టెంట్‌, శ్రీకాకుళం

బీచ్‌ రోడ్డు(విశాఖ) :

రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు విశాఖ నగరం నడిబొడ్డున భారీ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌, ద్వారకానగర్‌ బస్టాండ్‌ కూడలిని ముట్టడించి రాస్తారోకో నిర్వహించారు. ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులు రహదారులపైకి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. చేతుల్లో ఖాళీ వాటర్‌ బాటిళ్లతో శబ్దాలు చేస్తూ, నినాదాలతో ప్రభుత్వ తీరును నిరసించారు. ‘మేం ఉద్యోగులం.. ఊడిగం చేసేవాళ్లం కాదు’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తమను కిందిస్థాయి సిబ్బందిగా తక్కువ చేసి చూస్తున్నారని, విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు, ఉద్యోగుల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.

జీఓ 11 రద్దు చేయాలని డిమాండ్‌

తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. వివాదాస్పద జీఓ నంబర్‌ 11ను వెంటనే రద్దు చేయాలని, డిప్యూటేషన్ల పేరుతో వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్లు కల్పించాలని, పని వేళలు ముగిసిన తర్వాత కూడా వాట్సాప్‌ సందేశాల ద్వారా అధికారులు ఒత్తిడి చేయడం నిలిపివేయాలని కోరారు. నెలలుగా పేరుకుపోయిన సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు.

సచివాలయ ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం

సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం తెలిపింది. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, మెరిట్‌ ఆధారంగా 1.34 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు.

ఇద్దరు ఉద్యోగులకు అస్వస్థత

సచివాలయ ఉద్యోగుల నిరసనలో ఇద్దరు ఉద్యోగులు స్పృహతప్పి పడిపోవడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగుతుండగా, మధ్యాహ్నం రోడ్డుపై నిరసన సందర్భంగా నీరసంతో వారు కుప్పకూలిపోయారు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి ఒకరిని 108 అంబులెన్స్‌లో, మరొకరిని ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement