గార : కూటమి ప్రభుత్వంలో మోసపోయామని ప్రజలు గ్రహించారని, ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అసత్యాలని ప్రజలు అర్ధం చేసుకున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం గార మండలం తూలుగు పంచాయతీ పెద్ద ఉప్పరిపేటలో టీడీపీ నుంచి పలు కుటుంబాలు వైఎస్సార్ సీపీ పార్టీలో చేరాయి. వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే అన్నీ అమలు చేసేశామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మత్స్యకారుడైన సీదిరి అప్పలరాజును జైల్లో పెడితే పరామర్శించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారని, ఆ సమయంలో ప్రజలు ప్రవాహంలా వచ్చారన్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం ప్రజల్లో స్పందన కరువవుతోందన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు రూ. 200 కోట్లు నష్టం వచ్చిందన్నారు. రూ.280 ఉన్న యూరియా బ్లాక్ మార్కెట్‌లో రూ.1000కు అమ్ముతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఇసుక, మట్టి, ఏది దొరికితే అది అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగితే అవన్నీ తామే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మూలపేట పోర్టును సైతం తామే తీసుకొచ్చినట్లు జిల్లాకు చెందిన మంత్రి చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో వైఎస్సార్ సీపీకి 51 శాతం, కూటమి పార్టీలకు 43 శాతం వచ్చిందని, టీడీపీ ప్రభుత్వానికి పాడి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. ఈ రోజు ప్రారంభమైన చేరికలు పెరిగి పెద్దవై జిల్లా నుంచి టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలన్నారు. మాజీ సర్పంచ్ కొయ్యాన నాగభూషణం ఆధ్వర్యంలో పిండి అప్పన్న, తంగెల్లా అప్పారావు, మొగిలి రాంబాబు, గుర్రాల రమేష్ తదితరులు పార్టీలో చేరారు. ముందుగా వైఎస్సార్ సీపీ జెండాను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువనాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, ఎంపీపీ గొండు రఘురామ్, ఎస్‌ఈసీ సభ్యుడు గొండు కృష్ణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, బరాటం నాగేశ్వరరావు, పీస శ్రీహరిరావు, అరవల రామకృష్ణ, అందవరపు బాలకృష్ణ, యాళ్ల నారాయణ, రాష్ట్ర పోలినాటి వెలమ విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, తమ్మిన అప్పలరాజు, బరాటం నాగరాజు, గంగు రామారావు తదితరులు పాల్గోన్నారు.
పథకాల అమలుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం
పెద్ద ఉప్పరిపేటలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు


