ఫిక్సిడ్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

ఫిక్సిడ్‌ మోసం

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

ఆమదాలవలస ఎస్‌బీఐలో కలకలం

ఓ వ్యక్తి పేరిట ఉన్న సొమ్మును కాజేసిన నకిలీ వారసుడు

టీడీపీ నేత అసలు సూత్రధారి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: సామాన్యుడికి సవాలక్ష నిబంధనలతో బ్యాంకు అధికారులు, సిబ్బంది చుక్కలు చూపిస్తుంటారు. అటువంటిది ఓ ఫిక్సిడ్‌ డిపాజిట్‌ విషయంలో నిబంధనలను పక్కన పెట్టేశారు. వారసుల స్థానంలో మరొకరు నకిలీ పత్రాలు సృష్టించి మరీ మోసానికి పాల్పడటం.. ఇందులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర వెలుగుచూడడం సంచలనంగా మారింది. ఆమదాలవలస స్టేట్‌బ్యాంక్‌లో వెలుగుచూసిన ఈ ఘరానా మోసానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఎల్‌ఎన్‌పేటకు చెందిన వైశ్యరాజు నాగేశ్వరరావు ఆమదాలవలస స్టేట్‌ బ్యాంక్‌లో కొన్నేళ్ల కిందట ఫిక్సిడ్‌ డిపాజిట్లు చేశారు. ఇటీవల నాగేశ్వరరావు మరణించారు. ఆయన కుమారుడు వైశ్యరాజు సంతోష్‌రాజు ఆ మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకునేందుకు సంబంధిత పత్రాలతో బ్యాంకుకు వెళ్లారు. అయితే, అప్పటికే ఈ మొత్తం క్లెయిమ్‌ చేసుకున్నారని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. ఎల్‌ఎన్‌పేటకు చెందిన ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో పలాస ప్రాంతానికి చెందిన ఇదే ఇంటి పేరు వైశ్యరాజు సంతోష్‌రాజు పేరుతో ఉన్న వ్యక్తి.. పాన్‌ నంబర్‌, ఆధార్‌ నంబరుతో ఏమార్చి ఒక ఖాతాను సృష్టించారు. తానే అసలైన వారసుడిగా చూపించి ఫిక్సిడ్‌ డిపాజిట్‌ బదలాయించారని తెలుస్తోంది. మరోవైపు ఇదే వైశ్యరాజు నాగేశ్వరరావు పేరుతో ఎల్‌ఎన్‌పేట యూనియన్‌ బ్యాంక్‌లో ఓ ఖాతా ఉంది. ఆ అకౌంట్‌లో సుమారు రూ.78 లక్షలు ఉంది. అదే మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు వీలుగా వారసత్వ సర్టిఫికెట్‌, ఇతర ధ్రువీకరణ పత్రాల పేరుతో నకిలీ వారసుడు దరఖాస్తు చేసుకున్నాడు. అనుమానం వచ్చిన యూనియన్‌ బ్యాంకు అధికారులు ఎల్‌ఎన్‌పేట గ్రామానికి వెళ్లి ఆరా తీయగా నకిలీ అని తేలినట్టు సమాచారం.

అటు ఆమదాలవలస ఎస్‌బీఐ బ్యాంకులో ఘరానా మోసానికి.. ఇటు ఎల్‌ఎన్‌పేట యూనియన్‌ బ్యాంకు ఖాతాలో నిధులు పక్కదారి పట్టించేందుకు కుట్ర జరగడం వెనుక హిరమండలానికి చెందిన వ్యాపారి, టీడీపీ నేత లాడె బలరాం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది సహకరించినట్టు తెలుస్తోంది. నాగేశ్వరరావు అనే ఖాతాదారుడు యాక్టివ్‌గా లేని విషయాన్ని గుర్తించి ఈ కుట్రకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అదే వైశ్యరాజు సంతోష్‌రాజు పేరుతో ఆధార్‌, పాన్‌ నంబర్‌ సృష్టించి రూ.17 లక్షలు క్లెయిమ్‌ చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం పరిణామాలకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి టీడీపీ నేత కావడంతో కప్పిపుచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement