● కనీసం వేతనాల కోసం కదం తొక్కిన స్కీమ్ వర్కర్లు
● పోలీసు అరెస్టులతో ఉద్రిక్తత
● కలెక్టర్ కార్యాలయం ముట్టడి, పలువురు అరెస్ట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్‌వాడీ, ఆశ, తదితర స్కీమ్ వర్కర్లకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలుచేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ లు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికు లు, స్కూల్ శానిటేషన్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అధిక సంఖ్యలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ముందుగా ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
స్కీమ్ వర్కర్లకు ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని, డీఏ కూడా అమలుచేయడం లేదన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. యాప్‌ల వల్ల పనిభారం పెరిగి అంగన్‌వాడీలు మానసిక ఇబ్బందులకు గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరారు. ఈ సందర్బంగా 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు, వివిధ సంఘాలు నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.త్రినాథరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఖగేష్ పాల్గొన్నారు.


