● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
● మరొకరి పరిస్థితి విషమం
● బారసాలకు వెళ్లి వస్తుండగా చాపురం వద్ద ఘటన
దారి నిండా నెత్తుటి మరకలు.. ఆవరణంతా రోదనలు.. రక్తమోడుతూ క్షతగాత్రులు.. ప్రమాదానికి సాక్షులుగా వాహనాలు.. చాపురం వద్ద ఆదివారం కనిపించిన భీతావహ దృశ్యాలివి. కంటైనర్‌ను ఎర్టిగా వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు కన్నుమూయగా నలుగురు గాయపడ్డారు. శుభ కార్యానికి ఉత్సాహంగా వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న వారిని ప్రమాదం ఇలా పలకరించింది. అతివేగం, ఓవర్ టేక్ చేసేయాలనే అత్యుత్సాహం ప్రమాదానికి హేతువులయ్యాయి.
రోడ్డుపై క్షతగాత్రుల ఆర్తనాదాలు
శ్రీకాకుళం రూరల్/క్రైం:
శ్రీకాకుళం రూరల్ పరిధిలోని జాతీయ రహదారి చాపురం వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ ఎస్‌ఐ సురేష్ ఇచ్చిన వివరాలు మేరకు.. నరసన్నపేట మండలం పోలాకి, టెక్కలిలోని తెలు గు బ్రాహ్మణ వీధికి చెందిన ఏడుగురు వ్యక్తులు కలిసి రాజాంలోని తమ బంధువుల ఇంటిలో బారసాలకు ఆదివారం బయల్దేరారు. ఈ వేడుకకు వెళ్లేందుకు ఎర్టిగా వాహనాన్ని బుక్ చేసుకున్నారు. రా జాంలో కార్యక్రమం ముగిశాక మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా.. శ్రీకాకుళం సమీపంలోని చాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో బంకుపల్లి గోపాలం (60) అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పుట్టా వినయ్ (42) రిమ్స్‌కు తరలిస్తుండగా దారిలోని చనిపోయారు. గాయపడిన బంకుపల్లి లత పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో గాయపడిన దార్లపూడి విజయ్‌కుమార్, డీవీఎస్ శర్మ, జయలక్ష్మి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
ఈ ప్రమాదానికి కంటైనర్ అతివేగమే కారణమని తెలుస్తోంది. ముందుగా ఎర్టిగా వాహనం వెళ్తుండగా వెనుక నుంచి వేరే లైన్‌లో వస్తున్న కంటైనర్ వాహనం కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ముందుకు వెళ్లింది. ఆ ప్రయత్నంలో కంటైనర్ వెనక ఉన్న హుక్ కారుకు తగిలింది. దీంతో సుమారు 160 అడుగుల దూరం వరకు కంటైనర్ వాహనం ఎర్టిగా కారును లాక్కెళ్లిపోయి జాతీయ రహదారి మార్గంలో గల రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ఇరుక్కుపోయిన వారికి బయటకు తీయడం కూడా చాలా కష్టమైంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ మళ్లించారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.
ఆలస్యంగా అంబులెన్స్‌లు
ప్రమాదం జరిగిన అరగంట తర్వాత గానీ అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి రాలేదు. అప్పటి వరకు క్షతగాత్రులు నరక యాతన అనుభవించారు. ప్ర మాదం జరిగిన వెంటనే అంబులెన్స్ స్పందించి ఉంటే డ్రైవర్ బతికి ఉండేవాడన్న వాదనలు స్థానికంగా వినిపించాయి.
ఉలిక్కిపడిన పోలాకి
పోలాకి: చాపురం సమీపంలో జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో క్షతగాత్రులు పోలాకి గ్రామానికి చెందిన వారనే సమాచారం తెలియగానే పోలాకి మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దార్లపూడి విజయకుమార్ స్పృ హలో లేరని, అతని భార్య జయలక్ష్మికి చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆ ఫోను రావడం వల్లనేనా..
శ్రీకాకుళం: చాపురంసమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదానికి కారణం డ్రైవర్‌కు వచ్చిన ఫోన్ కాలేనని ప్రమాదం నుంచి బయటపడిన రోజా చెబుతున్నారు. ప్రమాదం జరిగేందుకు 10 నిమిషాల ముందు డ్రైవర్‌కు ఫోన్ వచ్చిందని త్వరగా వస్తే మరో కిరాయి ఉందని చెప్పడంతో వేగం పెంచాడని ఆమె తెలి పారు. ఆమదాలవలసకు వెళ్లే ఫ్లైఓవర్ వద్ద తోవ తప్పి సర్వీసు రోడ్డుకు దిగామని, ఆ రోడ్డు నుంచి ముందుకు వెళ్లకుండా మళ్లీ వెనక్కి తిప్పి ఫ్లై ఓవర్ ఎక్కించాడని, ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరిగిందని ఆమె వివరించారు. ఇలా ఫ్లైఓవర్ ఎక్కకుండా సర్వీస్ రోడ్ లోనే వెళ్లి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని అన్నారు. పెద్ద వయసు వారు ముందు సీట్లో కూర్చోవడంతో తాను వెనుక సీటులో కూర్చున్నానని, దీంతో తనకు ప్రమాదం తప్పిందన్నారు.
నరసన్నపేట: చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్ట వినయ్ మృతి చెందాడు. పోలాకి మండలం గొల్లలవలసకు చెందిన కారు యజమాని దీర్గాశి వద్ద డ్రైవర్‌గా పట్ట వినయ్ పనిచేస్తున్నారు. వినయ్ తల్లిదండ్రులు నిరుపేదలు, తండ్రి సింహాచలం స్థానిక హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తుండగా తల్లి భద్రమ్మ గృహిణి.


