సోంపేట: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు దారుణమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ అన్నారు. సోంపేట చేరుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవిని పార్టీ నాయకులలో పాటు ఆమె ఆది వారం సాయంత్రం కలిసి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా పిరియా విజయ మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు దారుణమని అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార నాయకుడిగా తన గొంతును బలంగా వినిపిస్తున్నారని, జిల్లా అభివృద్ధికి ఎంతో చేశారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి ఎదుగుదల చూసి ఓర్వలేక అరెస్టు చేశారని ఆరోపించారు. ఎంపీపీలు పైల దేవదాస్ రెడ్డి, బోర పుష్ప, పార్టీ నాయకులు శిలగాన భాస్కరరావు, ఇప్పిలి కృష్ణారావు, నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్
శ్రీకాకుళం కల్చరల్: దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. కార్గిల్ దివస్ సందర్భంగా జిల్లా పరిషత్ రోడ్డు సమీపంలోని ఉన్న కార్గిల్ పార్కులో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆ యన మాట్లాడారు. ఈ యుద్ధంలో శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 92 మంది సైనికులు పాల్గొనడం గర్వకారణమన్నారు. అనంతరం పలువురు సైనికాధికారులను సత్కరించారు. సమావేశంలో జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, లీగల్ అడ్వైజర్ జ్యోతిర్మయి, రిటైర్డు ఆర్మీ అధికారి పెద్ది ఈశ్వరావు, కార్గిల్ యుద్ధ వీరు లు, పూర్వ సైనికులు, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సజావుగా దర్శనాలు
అరసవల్లి: సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం ప్రత్యేక సందడి కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో పా టు వాతావరణం చల్లగా ఉండడంతో భక్తులు సజావుగా దర్శనాలను చేసుకున్నారు. ఆలయ ఈఓ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తుల దర్శనాలకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. ప్రసాదాల కౌంటర్ వద్ద నగదు చెల్లించిన భక్తులకు కేవలం రెండు పులిహోర, రెండు లడ్డూలను మాత్రమే ఇచ్చేలా చర్యలు చేపట్టారు. అదే మనమిత్ర యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించిన వారికి అవసరమైనన్ని పులిహోర ప్యాకె ట్లు, లడ్డూలను ఇచ్చేలా చర్యలు చేపట్టారు. దీంతో కొందరు భక్తులు ఇబ్బందులు పడ్డారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అరసవల్లి ఆలయంలో ప్ర త్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. విమానాశ్రాయ వాస్తుదోష నివారణ, వ్యాపారాభివృద్ధి, ప్రయాణికుల భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ఈ నెలాఖరు వరకు నిత్యం ప్రత్యేక హోమాదుల కార్యక్రమాలను దేవదాయ శాఖ సంకల్పించింది. మెప్మా ఆధ్వర్యంలో ఇంద్రపుష్కరిణి మార్గంలో స్వయం శక్తి సంఘాల ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలను నిర్వహించారు.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. అర్జీల గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు.
సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవితో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ తదితరులు


